Thursday, 15 January 2026

దేశంలో స్థిరంగా నిరుద్యోగిత రేటు


డిసెంబర్‌లో 4.8 శాతంగా నమోదు

పెరిగిన కార్మిక భాగస్వామ్యం, ఉపాధి అవకాశాలు

న్యూఢిల్లీ: భారత ఆర్థికవ్యవస్థలో ఉపాధి పరిస్థితులు స్థిరంగా కొనసాగుతున్నాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో దేశ నిరుద్యోగితా రేటు డిసెంబర్ నెలలో 4.8 శాతంగా నమోదైంది. నవంబర్ నెలలో ఇది 4.7 శాతంగా ఉండగా, స్వల్ప మార్పుతో దాదాపు స్థిరంగా కొనసాగుతున్నదని గణాంకాలు సూచిస్తున్నాయి. గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నెలవారీ నివేదిక ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగితా రేటు ఎటువంటి మార్పు లేకుండా 3.9 శాతంగానే ఉంది. ముఖ్యంగా గ్రామీణ పురుషులలో ఇది 4.1 శాతంతో అత్యంత తక్కువస్థాయిలో స్థిరంగా ఉండటం గమనార్హం. అదేవిధంగా పట్టణ మహిళల్లో నిరుద్యోగితా రేటు నవంబర్‌లోని 9.3 శాతం నుంచి డిసెంబర్‌లో 9.1 శాతానికి తగ్గి స్వల్ప మెరుగుదల కనబరిచింది.



ఉపాధి రంగంలో సానుకూల ధోరణిని ప్రతిబింబిస్తూ కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (LFPR) పెరుగుదల బాటలో ఉంది. నవంబర్‌లో 55.8 శాతంగా ఉన్న ఈ రేటు డిసెంబర్ నాటికి 56.1 శాతానికి చేరుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 58.6 శాతం నుంచి 59 శాతానికి పెరిగింది. అంటే ఎక్కువమంది ప్రజలు పని చేయడానికి ఆసక్తి చూపుతూ మార్కెట్లోకి వస్తున్నారని అర్థమవుతున్నది. వీటన్నింటికీ మించి, మొత్తం జనాభాలో పని చేసే వారి నిష్పత్తి (Worker Population Ratio) డిసెంబర్ నెలలో 53.4 శాతానికి చేరుకుని వార్షిక గరిష్టస్థాయిని తాకింది. ఈ గణాంకాలు దేశంలో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతంగా సాగుతున్నాయని మరియు ఉపాధి కల్పనలో స్థిరత్వం కొనసాగుతున్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...