- మరోసారి గర్జించనున్న ‘శివాని శివాజీ రాయ్’
- రాణి ముఖర్జీ ఉద్వేగభరిత వ్యాఖ్యలు!
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ తన కెరీర్‌లో అత్యంత శక్తివంతమైన పాత్రగా నిలిచిన ‘శివాని శివాజీ రాయ్’గా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘మర్దాని’లో మూడవ భాగంపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మర్దాని 3’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, అది మహిళా సాధికారత, ధైర్యం , ఆశల ప్రతిరూపమని ఆమె అభివర్ణించారు. ఈ చిత్రం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబించడమే కాకుండా, వాటిని ఎదిరించే స్ఫూర్తిని కూడా ఇస్తుందని ఆమె పేర్కొన్నారు.
చిత్రం కోసం రాణి ముఖర్జీ ప్రత్యేకంగా శిక్షణ
మొదటి రెండు భాగాలకు లభించిన అఖండ ఆదరణ తర్వాత, మూడవ భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీనిపై రాణి ముఖర్జీ మాట్లాడుతూ.. శివాని శివాజీ రాయ్ పాత్ర తన హృదయానికి చాలా దగ్గరైనదని, ఈసారి కథ మరింత పకడ్బందీగా, లోతైన సందేశంతో ఉంటుందని వెల్లడించారు. మహిళలపై జరిగే అరాచకాలపై రాజీలేని పోరాటం చేసే పోలీస్ ఆఫీసర్‌గా రాణి ప్రదర్శన మునుపటి కంటే ఈసారి మరింత పదునుగా ఉండబోతున్నదని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం కోసం రాణి ముఖర్జీ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారు.
ఈ సినిమా కేవలం థ్రిల్లింగ్ అంశాలకే పరిమితం కాకుండా, సమాజంలో మహిళా రక్షణ , వారి ప్రాముఖ్యంపై చర్చను లేవనెత్తుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తున్నది. రాణి ముఖర్జీ ఈ చిత్రంలో తనదైన శైలిలో యాక్షన్ సీక్వెన్స్‌లలో మెరవనున్నారు. ప్రస్తుత సమాజానికి ఇలాంటి కథల అవసరం ఎంతో ఉందని, ప్రతి మహిళ తనలో ఉన్న శక్తిని గుర్తించేలా ఈ సినిమా ప్రేరేపిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్న ఈ చిత్రం, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.
No comments:
Post a Comment