- సమాజాన్ని విడదీసేలా ఉన్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు
- పాత రూల్స్ ఫాలో అవ్వాలని ఆదేశం
- తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా
న్యూఢిల్లీ: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ప్రవేశపెట్టిన 'ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ రెగ్యులేషన్స్-2026'పై సుప్రీంకోర్టు గురువారం మధ్యంతర స్టే విధించింది. ఈ కొత్త నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని, ఇవి దుర్వినియోగమయ్యే అవకాశం ఉండటమే కాకుండా సమాజాన్ని కులాల వారీగా విడదీసే ప్రమాదం ఉందని అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు 2012 నాటి పాత నిబంధనలే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
తిరోగమన వివక్ష'కు దారితీస్తుంది
కొత్త నిబంధనలలోని సెక్షన్ 3(1)(సీ) ప్రకారం.. కుల వివక్ష అంటే కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు వ్యతిరేకమైనదిగా మాత్రమే నిర్వచించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఒక రకమైన 'తిరోగమన వివక్ష'కు దారితీస్తుందని, జనరల్ కేటగిరీ విద్యార్థులను రక్షణ లేకుండా చేస్తుందని దాఖలైన పిటిషన్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. "మనం కులరహిత సమాజం దిశగా వెళ్తున్నామా లేక వెనక్కి ప్రయాణిస్తున్నామా?" అని సీజేఐ ఈ సందర్భంగా ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో ప్రత్యేక హాస్టళ్లు వంటి ప్రతిపాదనలు ఉండటంపై కూడా కోర్టు విస్మయం వ్యక్తం చేస్తూ, ఇలాంటి చర్యలు విద్యార్థుల మధ్య విభజనను పెంచుతాయని హెచ్చరించింది.
నిబంధనలపై న్యాయ నిపుణులతో సమీక్ష చేయాలి
ఈ వివాదాస్పద నిబంధనలపై న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ద్వారా సమీక్ష చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, యూజీసీకి సుప్రీంకోర్టు సూచించింది. దేశవ్యాప్తంగా జనరల్ కేటగిరీ విద్యార్థులు ఈ కొత్త రూల్స్‌కు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్న తరుణంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసిన ధర్మాసనం, అప్పటి వరకు ఎవరూ ఎటువంటి వివక్షకు గురికాకుండా చూడటం విద్యాసంస్థల బాధ్యత అని పేర్కొంది.
No comments:
Post a Comment