Tuesday, 27 January 2026

దక్షిణ కొరియాకు ట్రంప్ భారీ షాక్


  • దిగుమతి సుంకాలను 25 శాతానికి పెంచుతూ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా వస్తువులపై దిగుమతి సుంకాలను ఒక్కసారిగా 15 శాతం నుంచి 25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించి అంతర్జాతీయ వాణిజ్యవర్గాల్లో కలకలం రేపారు. ఇరుదేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేయడంలో దక్షిణ కొరియా శాసనసభ వైఫల్యం చెందడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్.. ఆటోమొబైల్స్, కలప, ఔషధ రంగాలు. ఇతర పరస్పర వాణిజ్య వస్తువులపై ఈ పెంచిన సుంకాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అయితే, సవరించిన ఈ పన్నులు ఇప్పటికే అమలులోకి వచ్చాయా లేదా అనే అంశంపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.



గత ఏడాది (2024) గణాంకాల ప్రకారం, దక్షిణ కొరియా నుంచి అమెరికాకు సుమారు 132 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి. ముఖ్యంగా కార్లు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల సరఫరాలో అమెరికాకు దక్షిణ కొరియా ఒక ప్రధాన వనరుగా ఉంది. ఇప్పుడు తాజా పన్ను పెంపుతో ఈ వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. గతేడాది జూలైలో కుదిరిన ఒప్పందం ప్రకారం సుంకాలను 15 శాతానికి ఖరారు చేస్తూ, అందుకు ప్రతిగా అమెరికా నియంత్రణలోని పెట్టుబడుల కోసం దక్షిణ కొరియా 350 బిలియన్ డాలర్లు సమకూరుస్తుందని ట్రంప్ గతంలో ప్రకటించారు. అయితే తాజా నిర్ణయం ఆ ఒప్పందాన్ని తలకిందులు చేయడమే కాకుండా, ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి.

No comments:

Post a Comment

Featured post

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది

 ఢిల్లీలో నిరసనకారులపై భారీగా పోలీసు బలగాలను మోహరించడమే దీనికి నిదర్శనం మండిపడిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  బెంగళూరు: ప్...