Friday, 23 January 2026

యువతకు తీపి కబురు: 61 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు


  • 18వ రోజ్‌గార్ మేళాలో నియామక పత్రాలు అందజేయనున్న ప్రధాని మోడీ

దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. ఇందులో భాగంగా శనివారం నిర్వహించనున్న 18వ రోజ్‌గార్ మేళాలో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 61,000 మందికి పైగా కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేళా ద్వారా ఎంపికైన వారు హోం వ్యవహారాలు, ఆరోగ్య , కుటుంబ సంక్షేమం, ఆర్థిక సేవలు, ఉన్నత విద్యా శాఖ వంటి కీలకమైన కేంద్ర మంత్రిత్వ శాఖలు , విభాగాలలో విధుల్లో చేరనున్నారు. నియామక పత్రాల పంపిణీ అనంతరం కొత్తగా విధుల్లో చేరుతున్న యువతను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.



ఉపాధి కల్పనకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ 'రోజ్‌గార్ మేళా' వినూత్న మైలురాళ్లను అధిగమిస్తున్నది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వివిధ విడతల్లో 11 లక్షలమందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయడం విశేషం. మిషన్ మోడ్‌లో ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వ సేవలను మరింత వేగవంతం చేయడమే కాకుండా, యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. ప్రభుత్వ శాఖల్లో పారదర్శకతను పెంచుతూ, అర్హులైన అభ్యర్థులకు త్వరితగతిన ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఈ మేళాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...