- కాంగ్రెస్‌తో విభేదాలు పక్కనపెట్టి ఏకతాటిపైకి రావాలని ఉద్ధవ్ సేన పిలుపు
- రాష్ట్రాల రాజకీయ సమీకరణాలే అడ్డంకిగా మారుతాయా?
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై ఎన్నికల సంఘం, ముఖ్య ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపడుతున్న ఆందోళనలకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), డీఎంకే దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్‌తో విభేదాలను పక్కనపెట్టి SIRకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఆప్, డీఎంకే కూడా భాగస్వాములు కావాలని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) సూచించింది.
పార్టీ అధికారిక పత్రిక ‘సామ్నా’లో ప్రచురించిన సంపాదకీయంలో దేశవ్యాప్తంగా SIRకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నప్పటికీ ఆప్, డీఎంకే వాటికి దూరంగా ఉన్నాయని పేర్కొంది. ‘‘నియంతృత్వానికి’’ వ్యతిరేకంగా పోరాడేందుకు కాంగ్రెస్‌తో ఉన్న విభేదాలను పక్కనపెట్టి రెండు పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చింది. ఇండియా కూటమి నుంచి అధికారికంగా వైదొలిగిన ఈ రెండు పార్టీలు నిరసనలకు దూరంగా ఉండటం.. ప్రతిపక్ష శిబిరంలోని విభేదాలను మరోసారి స్పష్టంచేస్తోందని ‘సామ్నా’ పేర్కొంది.
ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం
మాజీ కాంగ్రెస్ నేత, రాజకీయ వ్యాఖ్యాత సంజయ్ ఝా.. ఉద్ధవ్ సేన చేసిన సూచన ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమైనదని అభిప్రాయపడ్డారు. SIRపై పోరాటం కేవలం ఒక పార్టీ లేదా రాజకీయ కూటమికి సంబంధించిన అంశం కాదని, ఓటు హక్కు, ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించినదని ఆయన పేర్కొన్నారు. CEC స్వచ్ఛందంగా రాజీనామా చేసే అవకాశం లేదని, కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల డిమాండ్లపై వెనక్కి తగ్గకపోవచ్చని సంజయ్ ఝా వ్యాఖ్యానించారు. అందువల్ల ప్రతిపక్ష పార్టీలన్నీ తమ మధ్య ఉన్న చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి విస్తృత అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.
ఆప్ స్పష్టమైన దూరం
ఇండియా కూటమి చేపడుతున్న నిరసనల్లో తాము పాల్గొనబోమని ఆప్ ఇప్పటికే స్పష్టం చేసింది. ‘‘మేము ఈ పోరాటాన్ని మా పద్ధతిలో కొనసాగిస్తున్నాం’’ అని పార్టీ పేర్కొంది. కాంగ్రెస్, ఆప్‌ల మధ్య మొదటి నుంచీ రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. ఆప్ తొలుత ఇండియా కూటమిలో భాగంగా ఉండి తొలి మూడు సమావేశాల్లో పాల్గొంది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఢిల్లీ, హరియాణా, గోవా, పంజాబ్, గుజరాత్‌లలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే ఎన్నికల అనంతరం ఆ పొత్తు కొనసాగలేదు. 2025 జూలైలో అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌తో సంబంధాలకు ముగింపు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్నికల సంఘంతో ఎదురైన రాజకీయ విభేదాలను ఉద్ధవ్ సేన తన సంపాదకీయంలో ప్రస్తావించింది. SIRపై ఆప్ ఇండియా కూటమికి దూరంగా ఉండటం ఆ పార్టీ ప్రయోజనాలకు అనుకూలం కాదని శివసేన (యూబీటీ) పేర్కొంది.
డీఎంకేలో భిన్నాభిప్రాయాలు
డీఎంకే మాత్రం ఈ అంశంపై మిశ్రమ సంకేతాలు ఇస్తోంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై.. ఓటర్ల జాబితాల సవరణపై రాహుల్ గాంధీ వైఖరి స్థిరంగా లేదని విమర్శించారు. తమిళనాడులో SIR సందర్భంగా ఓటర్ల పేర్లు తొలగించారన్న ఆరోపణలపై రాహుల్ స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసినట్లు ప్రచారంలో ఉన్న ఓ ప్రకటనను ప్రస్తావిస్తూ.. SIR తర్వాత ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేయాలన్న అభిప్రాయం తమిళనాడుకూ వర్తిస్తుందా? అని అన్నాదురై ప్రశ్నించారు. అయితే డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ మాత్రం రాహుల్ గాంధీ చేపట్టిన ఎన్నికల సంఘం వ్యతిరేక నిరసనలకు మద్దతు తెలిపారు. ప్రభుత్వ తప్పిదాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉందని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి CEC జ్ఞానేశ్ కుమార్ కారణమయ్యారని ఇళంగోవన్ ఆరోపించారు. అలాంటి రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తమిళనాడులో కాంగ్రెస్–డీఎంకే మధ్య పెరిగిన దూరం
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, డీఎంకేల మధ్య దాదాపు రెండు దశాబ్దాల రాజకీయ అనుబంధం తీవ్రంగా దెబ్బతింది. డీఎంకే–కాంగ్రెస్ కూటమి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత నటుడు-రాజకీయ నాయకుడు సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ భాగస్వామిగా మారింది. కాంగ్రెస్ నిర్ణయం డీఎంకేకు అసంతృప్తి కలిగించిందని కథనం పేర్కొంది. అప్పటి నుంచి తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు డీఎంకే కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తోంది. మరోవైపు, టీవీకేను కాంగ్రెస్ అధికారికంగా మద్దతు ఇవ్వడం, టీవీకే ఇండియా కూటమిలో చేరడం వంటి పరిణామాలు కూడా కాంగ్రెస్–డీఎంకే సంబంధాలను మరింత సంక్లిష్టం చేశాయి. ఇదే సమయంలో రాహుల్ గాంధీ అరెస్టు అంశంలో టీవీకే స్పందనను కూడా డీఎంకే తప్పుబట్టింది. రాహుల్‌ను ఎవరు అరెస్టు చేశారో స్పష్టంగా పేర్కొనలేదని ఇళంగోవన్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వాన్ని నేరుగా ఖండించాలని ఆయన కోరారు.
ఆప్–కాంగ్రెస్ మధ్య మరో కీలక పరీక్ష
ఆప్ విషయానికి వస్తే.. కాంగ్రెస్‌తో ఉన్న విభేదాలు మరింత సంక్లిష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్‌లో రెండు పార్టీలు ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ నేరుగా తలపడే పరిస్థితి ఉంది. పంజాబ్‌లో ప్రస్తుతం ఉన్న తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆప్ ప్రయత్నిస్తుండగా, తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఇరు పార్టీల మధ్య ఇప్పటికే తీవ్ర రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.
‘పెద్ద లక్ష్యాన్ని చూడాలి’
అయితే చిన్నచిన్న రాజకీయ విభేదాలను పక్కనపెట్టి దేశ ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును దృష్టిలో ఉంచుకోవాలని సంజయ్ ఝా సూచించారు. ఆప్, డీఎంకే చివరికి ఇండియా కూటమి నిరసనల్లో చేరే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే అది రాజకీయంగా ఎంతవరకు సాధ్యమవుతుందనేది కీలక ప్రశ్న. ఒకవైపు SIRపై ప్రతిపక్షాల ఉమ్మడి పోరాటం.. మరోవైపు రాష్ట్రాల వారీగా కాంగ్రెస్‌తో ఉన్న రాజకీయ పోటీలు. ఈ రెండింటిలో ఏది పైచేయి సాధిస్తుందన్నదే ఆప్, డీఎంకే భవిష్యత్తు వైఖరిని నిర్ణయించే అంశంగా మారనుంది.

No comments:
Post a Comment