న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో వాయు కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీపావళి పండుగ సమయంలో వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాలుష్య నియంత్రణకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)-3 ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది.
గురువారం ఢిల్లీలో ఏక్యూఐ 382కు చేరింది. సాధారణంగా 301 నుంచి 400 మధ్య ఏక్యూఐ ఉంటే వాయు నాణ్యత అత్యంత పేలవమైన స్థాయిలో ఉన్నట్లు పరిగణిస్తారు. పండుగ సమయంలో కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలు చేపట్టారు.
గ్రాప్-3 ఆంక్షల్లో భాగంగా అత్యవసరం కాని నిర్మాణ పనులపై నిషేధం విధిస్తారు. బీఎస్-3 లేదా అంతకంటే పాత ప్రమాణాలు కలిగిన పెట్రోల్ కార్లు, బీఎస్-4 లేదా అంతకంటే పాత ప్రమాణాల డీజిల్ కార్ల రాకపోకలపై పరిమితులు అమలు చేస్తారు. కంకర రోడ్లపై నిర్మాణ సామగ్రి రవాణాను నిషేధించడంతో పాటు స్టోన్ క్రషర్లు, గనుల తవ్వకాలను కూడా నిలిపివేస్తారు.
