అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ట్రంప్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని డర్టీ బాంబ్ లేదా రసాయనిక ఆయుధంతో దాడి చేసేందుకు ఇరాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికా భద్రతా విభాగాలు అప్రమత్తమై, ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఈ వార్తలపై వైట్‌హౌస్ ప్రతినిధి లారెన్ బిస్ స్పందిస్తూ, అమెరికాకు పొంచి ఉన్న ముప్పులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని తెలిపారు. అయితే, ప్రస్తుతానికి తక్షణ ప్రమాదం ఉన్నట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.
మరోవైపు, దాడులు, ఆర్థిక ఆంక్షల కారణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరాన్ అమెరికా ప్రధాన భూభాగాన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని కొందరు అమెరికా అధికారులు భావిస్తున్నట్లు కథనం తెలిపింది. అమెరికా ఆర్థిక ఆంక్షలకు సంబంధించిన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ నివాసాన్ని గత వారం సీక్రెట్ సర్వీస్ సిబ్బంది మిలిటరీ స్థావరానికి మార్చినట్లు కూడా పేర్కొంది.
- డర్టీ బాంబ్ తయారీ, తరలింపు సులభమేనా?
డర్టీ బాంబ్ తయారీకి అవసరమైన రేడియోధార్మిక పదార్థాలను తరలించడం సులభమని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నట్లు కథనం పేర్కొంది. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన వ్యక్తులను కొత్తగా అమెరికాలోకి పంపాల్సిన అవసరం లేకుండానే, ఇప్పటికే అక్కడ నివసిస్తున్న ఇరానీయులను ఈ కుట్రలో భాగస్వాములను చేసే అవకాశం ఉందని అనుమానిస్తున్నట్లు తెలిపింది. బాంబు తయారీకి అవసరమైన సామగ్రి కూడా ఇప్పటికే అమెరికాలోకి చేరి ఉండవచ్చని కొన్ని చాటింగ్‌ల ఆధారంగా ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేసినట్లు కథనం వెల్లడించింది. అయితే, ఇవన్నీ కథనంలో పేర్కొన్న అనుమానాలు, నిఘా వర్గాల హెచ్చరికలుగానే చూడాలి.

No comments:
Post a Comment