అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, పరిశోధకులు, జర్నలిస్టులకు ఊరటనిస్తూ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వీరి నివాస గడువును పరిమితం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి కొట్టివేశారు. ఎఫ్-1, జే-1, ఐ వీసాలపై అమెరికాకు వచ్చేవారి నివాస కాలపరిమితిని గణనీయంగా తగ్గిస్తూ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం 2026లో ఈ నిబంధనలు తీసుకొచ్చింది. అయితే, దీనిపై సెప్టెంబర్ 14నే కోర్టు ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిబంధన ఏకపక్షంగా, సహేతుకత లేకుండా, అధికార దుర్వినియోగానికి పాల్పడే విధంగా ఉందని న్యాయమూర్తి ఎఫ్. డెన్నిస్ స్లేయర్ వ్యాఖ్యానించారు. విదేశీ విద్యార్థులకు అవకాశాలు కల్పించడం కాంగ్రెస్ బాధ్యత అని, అందుకు విరుద్ధంగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ తీర్పుతో ఎఫ్-1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు, జే-1 వీసాలపై ఉన్న పరిశోధకులు, ప్రొఫెసర్లు, ఐ వీసాలపై ఉన్న విదేశీ జర్నలిస్టులకు ఊరట లభించింది.
గత నిబంధనల ప్రకారం ఎఫ్, జే వీసాలపై అమెరికాకు వచ్చినవారు తమ కోర్సు లేదా పరిశోధన పూర్తయ్యే వరకు, నిబంధనలకు లోబడి అక్కడ ఉండే అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లకు గరిష్ఠంగా నాలుగేళ్ల గడువు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఉండాలంటే మళ్లీ ఇమిగ్రేషన్ విభాగానికి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. విదేశీ జర్నలిస్టులకు గతంలో ఐదేళ్ల వరకు నివాస అవకాశం ఉండగా, దానిని 240 రోజులకు తగ్గించారు. చైనా జర్నలిస్టులకు ఈ గడువును కేవలం 90 రోజులకే పరిమితం చేశారు.
- శాస్త్రవేత్తలు, నిపుణులపైనా పెర్మ్ నిబంధనల ప్రభావం
మరోవైపు విదేశీ ఉద్యోగుల నియామకాలపై ట్రంప్ ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. విదేశీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ (పెర్మ్) నిబంధనల్లో కొత్త మార్పులను ప్రతిపాదించింది. ముఖ్యంగా టెక్నాలజీ, అవుట్‌సోర్సింగ్ రంగాల్లోని సంస్థలు అమెరికన్ ఉద్యోగులకు తొలగింపులు చేపడితే, అదే తరహా ఉద్యోగాల్లో విదేశీ సిబ్బందిని నియమించేందుకు రెండేళ్లపాటు పెర్మ్ సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోకుండా నిషేధం విధించే ప్రతిపాదన చేసింది.
ప్రస్తుతం సంస్థలు తమకు అవసరమైన అర్హతలున్న ఉద్యోగులు అమెరికాలో లభించడం లేదని నిరూపించడంతోపాటు, విదేశీ ఉద్యోగుల నియామకం అమెరికా కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధం కాదని చూపించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలను శాస్త్రవేత్తలు, అత్యంత నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులు, నర్సుల వంటి ఉద్యోగాలకు కూడా వర్తింపజేయాలని ప్రతిపాదించారు.
