Showing posts with label #UK #BlackSky #BeReady #CyberSecurity #EmergencyPreparedness #UnitedKingdom. Show all posts
Showing posts with label #UK #BlackSky #BeReady #CyberSecurity #EmergencyPreparedness #UnitedKingdom. Show all posts

Tuesday, 17 November 2026

‘బ్లాక్‌ స్కై’ ముప్పుపై బ్రిటన్‌ అప్రమత్తం.. మూడు రోజుల నిత్యావసరాలు సిద్ధం చేసుకోవాలని సూచన!



ఐరోపా దేశాలను గత కొన్ని వారాలుగా సాంకేతిక సమస్యలు, సైబర్‌ దాడుల అనుమానాలు, బాంబు బెదిరింపులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. సూపర్‌ మార్కెట్లలోని ఫ్రిజ్‌లు హ్యాకింగ్‌కు గురికావడం, మైక్రోసాఫ్ట్‌ సేవల్లో అంతరాయాలు, వరుస బాంబు బెదిరింపు ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ‘బ్లాక్‌ స్కై’ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ముందుగానే సిద్ధంగా ఉండాలని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రజలకు సూచిస్తోంది.


  • ఏమిటీ బ్లాక్‌ స్కై?


వివిధ కారణాల వల్ల దేశంలోని కీలక మౌలిక సదుపాయాలు పనిచేయక అత్యవసర సేవలు నిలిచిపోయే పరిస్థితిని ‘బ్లాక్‌ స్కై ఈవెంట్‌’గా వ్యవహరిస్తారు. సైబర్‌ దాడుల కారణంగా ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవలు నిలిచిపోవడం, ప్రకృతి విపత్తులు, వరదలు, కార్చిచ్చులు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విద్యుత్‌ సరఫరా ఆగిపోవడం వంటి పరిణామాలు ఇందులో భాగం. విద్యుత్‌ అంతరాయంతో నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం, దుకాణాల్లో ఫ్రిజ్‌లు పనిచేయకపోవడం, ఆసుపత్రులు, ప్రజా రవాణా వ్యవస్థల్లో సేవలు నిలిచిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇళ్లలో ఉష్ణోగ్రతలను నియంత్రించుకునే సౌకర్యం కూడా లేకుండా పోవచ్చు.


  • ‘బీ రెడీ’ ప్రచారంతో ప్రజలకు అవగాహన


ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బ్రిటన్‌ ప్రభుత్వం ‘బీ రెడీ’ పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినప్పుడు ప్రభుత్వ సమాచారాన్ని తెలుసుకునేందుకు బ్యాటరీతో పనిచేసే రేడియోలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. మొబైల్‌ ఫోన్ల కోసం పవర్‌ బ్యాంకులు సిద్ధంగా ఉంచుకోవాలని, కనీసం మూడు రోజులకు సరిపడా ఆహారం, తాగునీరు, ఇంధనాన్ని నిల్వ చేసుకోవాలని తెలిపింది.


అంతేకాకుండా గుర్తింపు కార్డుల జిరాక్స్‌ ప్రతులు, అత్యవసర ఫోన్‌ నంబర్లు, వాడుతున్న మందుల పేర్లు రాసి పెట్టుకోవాలని, కొంత నగదును చిల్లర రూపంలో అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఈ జాగ్రత్తలకు సంబంధించిన చెక్‌లిస్ట్‌ను ప్రభుత్వ వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచింది.


  • పెరిగిన నిత్యావసరాల కొనుగోళ్లు


ప్రభుత్వ సూచనల నేపథ్యంలో బ్రిటన్‌లో ఆహారం, తాగునీటి బాటిళ్లు వంటి నిత్యావసర వస్తువుల అమ్మకాలు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా ఆందోళన చెందవద్దని బ్రిటన్‌ రక్షణ మంత్రి వెస్‌ స్ట్రీటింగ్‌ విజ్ఞప్తి చేశారు.



Featured post

రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానాన్ని గొడ్డలితో ధ్వంసం చేసిన దుండగుడు.. ఐర్లాండ్‌లో సంచలనం!

ఐర్లాండ్‌లోని షానన్‌ విమానాశ్రయంలో పార్క్‌ చేసి ఉన్న అమెరికా సైనిక రవాణా విమానంపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గొడ్డలి, ప్రత్యేక రసాయనాన్ని...