అదృష్టం ఎప్పుడు, ఎవరిని వరిస్తుందో చెప్పలేం. సాధారణ జీవితాన్ని గడిపే వ్యక్తిని కూడా ఒక్కసారిగా కోటీశ్వరుడిని చేయగలదు. పంజాబ్‌లోని మొహాలీకి చెందిన ఓ ట్రక్కు డ్రైవర్‌కు దీపావళి లాటరీ రూపంలో అలాంటి అదృష్టమే దక్కింది. కేవలం రూ.500 పెట్టి కొనుగోలు చేసిన టికెట్‌తో ఏకంగా రూ.12 కోట్ల బంపర్ ప్రైజ్ గెలుచుకున్నాడు.
మొహాలీకి చెందిన బల్జిందర్ సింగ్ ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత 15 ఏళ్లుగా ప్రతి పండగ సీజన్‌లో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా పంజాబ్‌లో నిర్వహించిన ‘పంజాబ్ స్టేట్ డియర్ దీపావళి బంపర్’ లాటరీలో రూ.500 పెట్టి టికెట్ కొన్నాడు. ఆ టికెట్‌కే రూ.12 కోట్ల జాక్‌పాట్ దక్కింది.
తన కుటుంబ సభ్యులకు తెలియకుండానే లాటరీ టికెట్లు కొనుగోలు చేసేవాడినని, ఇన్నేళ్లకు తనకు అదృష్టం కలిసివచ్చిందని బల్జిందర్ సింగ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారని చెప్పాడు. లాటరీ ద్వారా వచ్చిన మొత్తంలో ఎక్కువ భాగాన్ని తన ఇద్దరు పిల్లల ఉన్నత చదువుల కోసం ఖర్చు చేస్తానని వెల్లడించాడు.
