ముంబై:
దేశంలోనే మొట్టమొదటి 'ఇండియన్ ఐడల్' (2004) సీజన్ విజేతగా నిలిచిన ప్రముఖ గాయకుడు అభిజిత్ సావంత్ తన ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్నారు. ఆ కాలంలో ప్లేబ్యాక్ సింగింగ్ ఇండస్ట్రీలో అప్పటికే స్థిరపడిన గాయకులు, సంగీత దర్శకుల ఆధిపత్యం ఉండేదని, రియాలిటీ షోల ద్వారా వచ్చిన తమలాంటి వారికి ఇండస్ట్రీలో అడుగుపెట్టడం చాలా కష్టంగా ఉండేదని ఆయన తెలిపారు. తాము అవకాశాల కోసం ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరి తలుపు తట్టాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తాజాగా 'ఇండియన్ ఐడల్ లెజెండ్స్ రిటర్న్' షో ద్వారా మరోసారి పోటీదారుడిగా బరిలోకి దిగుతున్న అభిజిత్ సావంత్.. ఆనాడు రియాలిటీ షో విజేతల ప్రాచుర్యం చూసి కొందరిలో భయాలు, అసూయ ఉండేవని చెప్పారు. అయినప్పటికీ 'ఇండియన్ ఐడల్' తనకు కేవలం గాయకుడిగానే కాకుండా ఒక టెలివిజన్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చిపెట్టిందని, 'బిగ్ బాస్' మరాఠీ, 'సెలిబ్రిటీ మాస్టర్‌చెఫ్', 'కామెడీ సర్కస్' వంటి విభిన్న షోలలో పాల్గొనే అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు. కేవలం ప్లేబ్యాక్ సింగింగ్‌కే పరిమితం కాకుండా 'మొహబ్బతే లుటాయేంగా' వంటి స్వతంత్ర పాప్ ఆల్బమ్‌లతో గుర్తింపు తెచ్చుకున్నానని చెప్పారు. ప్రస్తుతం ఒరిజినల్ మ్యూజిక్‌పై దృష్టి పెట్టానని, యువ సంగీతకారులతో కలిసి పనిచేసేందుకే ఈ షోకి వచ్చానని అభిజిత్ సావంత్ స్పష్టం చేశారు.

No comments:
Post a Comment