Thursday, 20 August 2026

వీడిన రూపారెడ్డి హత్య మిస్టరీ

 



  • ప్రిన్సిపల్‌ను 27 సార్లు కత్తితో పొడిచి హత్య
  • రూ.2.5 లక్షల కోసం విద్యార్థుల దారుణం

కొండమల్లేపల్లి: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో సంచలనం సృష్టించిన పాఠశాల ప్రిన్సిపల్‌ కల్లు రూపారెడ్డి (48) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎనిమిది రోజుల్లో ఛేదించారు. చదువుపై దృష్టి పెట్టకుండా వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు.. తల్లిదండ్రుల సమక్షంలో ప్రిన్సిపల్‌ మందలించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నారు. ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని తెలుసుకుని వారం రోజుల ముందే హత్యకు పథకం రచించారు. చివరకు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను హత్య చేసి రూ.2.50 లక్షల నగదు దోచుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.

కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌లో చదువుతున్న ఫూల్‌సింగ్‌ తండా, పిల్యాతండాలకు చెందిన ఇద్దరు 16 ఏళ్ల విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరూ స్నేహితులు కావడంతో పాటు అదే పాఠశాల వసతిగృహంలో ఉంటున్నారు. విద్యార్థులు సిగరెట్లు, మద్యం వంటి వ్యసనాలకు అలవాటు పడటాన్ని గమనించిన రూపారెడ్డి.. వారి తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. దీంతో ఆమెపై తీవ్ర కక్ష పెంచుకున్న విద్యార్థులు.. డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో హత్యకు పథకం వేశారు.

ఈ నెల 11న రూపారెడ్డి భర్త హైదరాబాద్‌లోనే ఉండటంతో ఆమె ఒక్కరే కొండమల్లేపల్లిలోని ఇంటికి వచ్చారు. ఇదే అదనుగా భావించిన నిందితులు పథకాన్ని అమలు చేశారు. ఫూల్‌సింగ్‌ తండాకు చెందిన విద్యార్థి ముందుగానే కొనుగోలు చేసిన హుడీ, టీషర్టు, ప్యాంటు, మాస్కులు తీసుకుని సాయంత్రం నాలుగు గంటల సమయంలో బయటకు వచ్చాడు. అనంతరం పిల్యాతండాకు చెందిన స్నేహితుడితో కలిసి కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారు.

రూపారెడ్డి ఇంటికి సమీపంలోని నీటి ట్యాంకు వద్ద ఒక విద్యార్థి కాపలాగా ఉండగా.. మరో విద్యార్థి ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించాడు. వంటగది తలుపు తెరిచి ఉండటంతో దాని ద్వారా ఇంట్లోకి వెళ్లాడు. అతడిని రూపారెడ్డి గుర్తించడంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై ఏకంగా 27 సార్లు దాడి చేసి హత్య చేశాడు. అనంతరం బెడ్‌రూంలో ఉన్న రూ.2.50 లక్షల నగదును తీసుకుని గోడ దూకి బయటకు వచ్చాడు.

ఇద్దరూ కలిసి రూపారెడ్డి సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేసి ఇంటికి సమీపంలోని ఓ బండరాయి కింద దాచారు. కొంతదూరం వెళ్లిన తర్వాత హత్య సమయంలో ధరించిన హుడీని డ్రైనేజీలో పడేశారు. అనంతరం తమ ఇళ్లకు వెళ్లి ఏమీ తెలియనట్లుగా వ్యవహరించారు. మరుసటి రోజు రూపారెడ్డి మృతదేహాన్ని చూసేందుకు కూడా వచ్చారు. దోచుకున్న నగదులో ఒకరు రూ.2.10 లక్షలు, మరొకరు రూ.40 వేలు పంచుకున్నారు. వారిలో ఒకరు ఆ డబ్బుతో ఖరీదైన సెల్‌ఫోన్‌ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

‘బాబు’ అనే చివరి మాటతో దర్యాప్తులో కీలక ఆధారం

హత్యకు ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ సమయంలో ఆమె చివరిగా ‘‘బాబు’’ అని పలికిన అనంతరం ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. ఈ మాట ఎవరిని ఉద్దేశించి అన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా.. అదే పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిపై అనుమానం బలపడింది. మరోవైపు నిందితులు సామాజిక మాధ్యమాల్లో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి, హత్య ఎలా చేయాలి, నేరం తర్వాత పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలి వంటి అంశాలను శోధించినట్లు దర్యాప్తులో గుర్తించారు.

హత్యకు ముందు నుంచే ఖరీదైన వస్తువులు, వాహనాలపై విద్యార్థులకు ఆసక్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సిగరెట్లు, మద్యం సేవించడంతోపాటు ఖరీదైన ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి జల్సా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. తొమ్మిదో తరగతిలోనే వారు గోవాకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

70 సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన

కేసును ఛేదించేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దాదాపు 70 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడంతోపాటు 80 మందిని విచారించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో పెండ్లిపాక ఎక్స్‌ రోడ్డు నుంచి కొండమల్లేపల్లికి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా లోదుస్తుల్లో దాచిన రూ.1.54 లక్షల నగదు లభించింది. నోట్ల కట్టలపై రక్తపు మరకలు ఉండటంతో అనుమానం బలపడింది.

విచారణలో ఇద్దరూ ప్రిన్సిపల్‌ రూపారెడ్డిని హత్య చేసి నగదు అపహరించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి రూపారెడ్డి ఐఫోన్‌, హత్యకు ఉపయోగించిన కత్తి, చేతి గ్లౌజులు, మాస్కులు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఈ వివరాలను బుధవారం వెల్లడించారు.

No comments:

Post a Comment

Featured post

పాస్‌పోర్ట్‌ వ్యవస్థపై పార్లమెంటరీ కమిటీ విస్తృత చర్చ

చట్ట సవరణపై సిఫారసులు: శశి థరూర్‌  న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్‌ వ్యవస్థ, ఈ-పాస్‌పోర్ట్‌ విధానం, పోలీసు వెరిఫికేషన్‌, పౌరసత్వ అంశాలు, పాస్‌పోర్ట్...