- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్
న్యూఢిల్లీ: హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సభ అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ కే.సీ. వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఆ ఘటన వెనుక ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి చెందిన ‘‘అగ్రవర్ణ మనస్తత్వం’’ ఉందని ఆయన ఆరోపించారు. బుధవారం జరిగిన CWC సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వేణుగోపాల్.. దేశవ్యాప్తంగా పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకులు, విద్యార్థుల ఆందోళనలు, రామమందిర విరాళాల వ్యవహారం, హల్ద్వానీ ఘటన, అరుణాచల్‌ప్రదేశ్ పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. సమావేశానికి 88 మందికి పైగా హాజరుకాగా, ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు సహా 33 మంది చర్చలో పాల్గొన్నారని చెప్పారు.
హల్ద్వానీ ఘటనపై వేణుగోపాల్ తీవ్రంగా స్పందిస్తూ.. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గేకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ ఘటనపై ప్రధాని మౌనం వహించడం సరికాదని, ప్రధాని నేరుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశంలో పరీక్షల నిర్వహణ, పేపర్ లీకుల సమస్యపై CWC ప్రత్యేకంగా చర్చించిందని వేణుగోపాల్ తెలిపారు. విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొన్న తీరుపై కూడా సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు ఈ అంశాలను బలంగా లేవనెత్తాయని, విద్యా రంగానికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం ఒత్తిడికి గురైందని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థుల సమస్యలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ చేపట్టిన ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వేణుగోపాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా చిన్న, మధ్య తరహా నగరాలతో కలిపి సుమారు 800 నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు.
రామమందిర విరాళాల వ్యవహారాన్ని కూడా కాంగ్రెస్ ఇకపై క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు వేణుగోపాల్ చెప్పారు. ‘చందా చోరీ’ పేరుతో ఈ అంశంపై దేశవ్యాప్తంగా గ్రామాలు, పంచాయతీలు, చౌపాల్ స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రామమందిర విరాళాల అంశం కేవలం ఆలయానికి సంబంధించిన విషయం కాదని, ప్రజల విశ్వాసం, భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని పరిణామాలపైనా CWC ఆందోళన వ్యక్తం చేసిందని వేణుగోపాల్ తెలిపారు. దేశభక్తి గురించి మాట్లాడేవారే అమెరికా, చైనాకు లొంగిపోయారని ఆయన బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. అదే స్థానాల సంఖ్యలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు ప్రజలు ఇచ్చిన విజయాన్ని CWC అభినందించిందని వేణుగోపాల్ తెలిపారు. తమిళనాడులోనూ బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.
No comments:
Post a Comment