- అమెరికా రాష్ట్రాలతో మెటా ఒప్పందం
ఓక్లాండ్, ఆగస్టు 26: పిల్లలు, టీనేజర్ల భద్రతకు సంబంధించి అమెరికాలోని 29 రాష్ట్రాలు దాఖలు చేసిన కేసులో మెటా కీలక మార్పులకు అంగీకరించింది. ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో యువ వినియోగదారుల వినియోగ సమయంపై పరిమితులు, రాత్రివేళ యాక్సెస్ నియంత్రణ, తల్లిదండ్రుల నియంత్రణలను మరింత బలోపేతం చేయనున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా ఉత్తర జిల్లా కోర్టులో బుధవారం దాఖలైన ఈ సెటిల్‌మెంట్‌కు కోర్టు ఆమోదం ఇంకా లభించాల్సి ఉంది. ఒప్పందం అమల్లోకి వస్తే 18 ఏళ్లలోపు వినియోగదారులకు రోజుకు గరిష్ఠంగా రెండు గంటల డిఫాల్ట్ వినియోగ పరిమితి ఉంటుంది. తల్లిదండ్రులు అనుమతిస్తేనే ఈ పరిమితిని పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే టీనేజర్లకు అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు డిఫాల్ట్‌గా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాక్సెస్‌ను నిలిపివేయనున్నారు. రాత్రివేళలు, పాఠశాల సమయాల్లో నోటిఫికేషన్లను కూడా పరిమితం చేయనున్నారు.
13 ఏళ్లలోపు పిల్లలు, 18 ఏళ్లలోపు వినియోగదారులను గుర్తించేందుకు మెటా తన వయసు నిర్ధారణ వ్యవస్థలను మరింత పటిష్ఠం చేయాలి. సంస్థ ఒప్పంద నిబంధనలను పాటిస్తోందో లేదో స్వతంత్ర ఆడిటర్ పర్యవేక్షించనున్నారు. ఈ మార్పులు కొన్ని నెలల్లోనే అమల్లోకి వస్తాయని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా వివిధ రాష్ట్రాలకు మెటా చెల్లించాల్సిన మొత్తం గరిష్ఠంగా సుమారు 16.68 బిలియన్ డాలర్లుగా కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. ఇందులో కొంత మొత్తం షరతులకు లోబడి ఉంటుంది. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కార్యాలయం ప్రకారం పదేళ్ల వ్యవధిలో రాష్ట్రాలకు 17 బిలియన్ డాలర్ల వరకు చెల్లింపులు జరిగే అవకాశం ఉంది.
పిల్లలు, టీనేజర్లు సోషల్ మీడియాను అధికంగా, వ్యసనపరంగా ఉపయోగించేలా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్లను రూపొందించిందని, వాటి వల్ల కలిగే ప్రమాదాలను సరిగా వెల్లడించలేదని ఆరోపిస్తూ 2023లో కేసు దాఖలైంది. 13 ఏళ్లలోపు పిల్లల డేటాను అక్రమంగా సేకరించి వినియోగించిందని, ఫెడరల్, రాష్ట్ర చట్టాలను ఉల్లంఘించిందని కూడా ఆరోపణలు వచ్చాయి. మెటా ఈ ఆరోపణలను, తనపై ఉన్న బాధ్యతను తిరస్కరించింది. ప్రతిపాదిత సెటిల్‌మెంట్ కూడా సంస్థ తప్పు చేసినట్లు అంగీకరించినట్లు కాదని స్పష్టం చేసింది. ఆగస్టు 18న కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులో ఈ కేసు విచారణ ప్రారంభమైన కొద్ది రోజులకే ఇరుపక్షాలు తాజా ఒప్పందానికి వచ్చాయి.
No comments:
Post a Comment