Thursday, 20 August 2026

కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ 300 కి.మీ. పాదయాత్ర





  • ఎర్రవల్లిలో అభిమానులకు ఆత్మీయ స్వాగతం

ఎర్రవల్లి: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలనే ఆకాంక్షతో కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి నుంచి ఎర్రవల్లి వరకు ఇద్దరు సామాన్య గిరిజనులు సుమారు 300 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో 11 రోజుల పాటు రోజుకు సగటున 25 కిలోమీటర్లు నడిచిన ఆటోడ్రైవర్‌ జాడే తిరుపతి, హోటల్‌ కార్మికుడు దుర్గం శంకర్‌ గురువారం ఎర్రవల్లిలోని కేసీఆర్‌ నివాసానికి చేరుకున్నారు.

ఆసిఫాబాద్‌ నియోజకవర్గం వాంకిడి మండలానికి చెందిన ఈ ఇద్దరు ఆదివాసీ యువకులు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం లేకుండా, ఎలాంటి వినతిపత్రం సమర్పించాలనే ఉద్దేశం లేకుండా కేవలం “కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి” అనే సంకల్పంతో ఈ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. కేసీఆర్‌ పాలనపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకే ఈ ప్రయాణం చేసినట్లు వెల్లడించారు.

ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సహకారంతో కేసీఆర్‌ను కలిసే అవకాశం లభించింది. ఎర్రవల్లికి చేరుకున్న తిరుపతి, శంకర్‌ను కేసీఆర్‌ ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘ పాదయాత్ర చేసినందుకు వారిని అభినందిస్తూ, వారి అభిమానాన్ని ప్రశంసించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ వారితో మాట్లాడుతూ “మళ్లా మన ప్రభుత్వం వస్తున్నది. అప్పుడు తప్పకుండా నన్ను వచ్చి కలవండి” అంటూ వారి భుజం తట్టి ప్రోత్సహించినట్లు తెలిపారు. అనంతరం వారిని ఆత్మీయంగా వీడ్కోలు పలికిన కేసీఆర్‌, తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు.

కేసీఆర్‌పై తమకు ఉన్న అభిమానమే కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని, ఎలాంటి స్వార్థ ప్రయోజనం లేకుండా ఆయన మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతోనే వాంకిడి నుంచి ఎర్రవల్లి వరకు కాలినడకన వచ్చినట్లు తిరుపతి, శంకర్‌ తెలిపారు. ఈ పాదయాత్ర బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

No comments:

Post a Comment

Featured post

పాస్‌పోర్ట్‌ వ్యవస్థపై పార్లమెంటరీ కమిటీ విస్తృత చర్చ

చట్ట సవరణపై సిఫారసులు: శశి థరూర్‌  న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్‌ వ్యవస్థ, ఈ-పాస్‌పోర్ట్‌ విధానం, పోలీసు వెరిఫికేషన్‌, పౌరసత్వ అంశాలు, పాస్‌పోర్ట్...