Wednesday, 19 August 2026

ఇమ్రాన్‌ ఖాన్‌ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలి




  •  సుప్రీం ఆదేశాలపై పాక్‌ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌


జైలులో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరుతూ పాక్‌ ప్రభుత్వం బుధవారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు మంగళవారం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 73 ఏళ్ల ఇమ్రాన్‌ ఖాన్‌ను రెండు రోజుల్లోగా షిఫా ఇంటర్నేషనల్‌ ఆస్పత్రికి తరలించి, సెప్టెంబర్‌ 16న తదుపరి విచారణ జరిగే వరకు అక్కడే ఉంచాలి. అలాగే ఆయనకు వైద్యం అందించేందుకు మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాలని, కుటుంబ సభ్యులను వారానికి ఒకసారి కలిసేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన కంటికి సంబంధించిన సమస్యకు జైలులో సరైన వైద్యం అందడం లేదని ఆరోపిస్తూ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశం తమకు వివక్షపూరితంగా ఉందని పాక్‌ ప్రభుత్వం తాజాగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక ఖైదీకి అనారోగ్యం తలెత్తిన ప్రతిసారీ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు ఇదే ఆదేశాన్ని ఉదాహరణగా చూపే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. జైలు నిబంధనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తన అధికార పరిధిని మించాయని రివ్యూ పిటిషన్‌లో ప్రభుత్వం వాదించింది.


ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని పార్టీ నేతలు ఆరోపించారు. పీటీఐ చైర్మన్‌ బారిస్టర్‌ గోహర్‌ అలీ ఖాన్‌.. ఇమ్రాన్‌ను వెంటనే షిఫా ఇంటర్నేషనల్‌ ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు కోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని కోరారు.


ఇమ్రాన్‌ ఖాన్‌ 2023 నుంచి రావల్పిండిలోని అదియాలా జైలులో ఉన్నారు. ఆయన అరెస్టు అనంతరం దేశవ్యాప్తంగా భారీ నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన మద్దతుదారులు జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇమ్రాన్‌ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆయనకు తగిన వైద్యం, కుటుంబ సభ్యులతో భేటీలు, న్యాయవాదులను కలిసే అవకాశం విషయంలో అధికారులు ఆంక్షలు విధిస్తున్నారని తరచూ ఆరోపిస్తున్నారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యంపై ప్రధాన ఆందోళన ఆయన కంటికి సంబంధించిన సమస్యే. జనవరి చివర్లో ఆయనకు కుడి కంటి రెటీనా సెంట్రల్‌ వెయిన్‌ ఆక్లూజన్‌ సమస్య బయటపడింది. అప్పటి నుంచి కంటి చికిత్స కోసం పలుమార్లు ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు తరలించారు. ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలన్న డిమాండ్లు కూడా అప్పటి నుంచి మరింత పెరిగాయి.

మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాలకు ఒక రోజు ముందు జైలు అధికారులు సమర్పించిన వైద్య నివేదికలో ఇమ్రాన్‌ ఖాన్‌ కంటి పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని, ఆయన చూపు దాదాపు సాధారణ స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. ఆయన రక్తపోటు 140/80గా, పల్స్‌ నిమిషానికి 54గా ఉన్నట్లు నివేదికలో తెలిపారు. ఈసీజీ సాధారణంగానే ఉందని, ఛాతీలో ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. జైలు అధికారులు తమ పరిధిలో ఇమ్రాన్‌కు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెబుతున్నప్పటికీ, ఆయన పార్టీ నేతలు మాత్రం ఆ వాదనను తిరస్కరిస్తున్నారు.

No comments:

Post a Comment

Featured post

నా జీవితం గురించి రాయడం అంత సులభం కాదు

 సోనియా గాంధీ భావోద్వేగ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తన జీవితంలోని అనుభవాలు, ప్రేమ, విషాదాలు, రాజకీయ ప్రస్థానాన్ని ...