- అక్రమ ఆస్తులు కాపాడుకునే పగటి కలలు ఇక చెల్లవు: మంత్రి పొంగులేటి
సత్తుపల్లి: 22A నిబంధనను భూతంగా చూపిస్తూ అమాయక ప్రజలను రెచ్చగొట్టి, దాని ముసుగులో అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంలో వారి పప్పులు ఉడకవని, అక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రజల సొమ్మును కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. సత్తుపల్లి, నారాయణపురంలో నిర్వహించిన భూభారతి భూ రీసర్వే అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. 22A అంశాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించవద్దని అన్నారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను ఎలాగైనా కాపాడుకోవాలనే ప్రయత్నాలు ఈ ప్రభుత్వంలో సాగవని స్పష్టం చేశారు.ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకుని అనుభవిస్తే వంట పట్టదని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. వేల ఎకరాల భూములను అక్రమంగా ఎలా సంపాదించారన్న విషయాలను వెలికితీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. భూముల వ్యవహారంలో అసలు వాస్తవాలేమిటో తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు.
భూభారతి భూ రీసర్వే ద్వారా భూములకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకువచ్చి, ప్రజల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. ప్రభుత్వ భూ విధానాలపై అపోహలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment