Tuesday, 11 August 2026

ఓటరు జాబితా నుంచి నా పేరు తొలగించారు

  •  ‘జోక్‌ బాగుంది.. గేమ్‌ ఆన్‌’ అంటూ ప్రకాశ్‌రాజ్‌ ఫైర్‌

బెంగళూరు: కర్ణాటకలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాశ్‌రాజ్‌ తీవ్రంగా స్పందించారు. బెంగళూరు నియోజకవర్గానికి చెందిన 65 లక్షల మంది ఓటర్లలో తన పేరు కూడా తొలగించారని ఆయన ఆరోపించారు. ‘‘జోక్‌ బాగుంది.. గేమ్‌ ఆన్‌’’ అంటూ ప్రభుత్వ, ఎన్నికల వ్యవస్థపై విమర్శలు చేశారు.



ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టింది ఈ నియోజకవర్గంలోనే. ఇక్కడే చదువుకున్నాను. కాలేజీ, థియేటర్‌ జీవితమంతా ఇక్కడే కొనసాగింది. అంతేకాదు, ఇదే నియోజకవర్గం నుంచి లోక్‌సభ అభ్యర్థిగానూ పోటీ చేశాను. అలాంటి నా ఓటు హక్కును SIR తర్వాత తొలగించారంటున్నారు. జోక్‌ బాగుంది.. గేమ్‌ ఆన్‌’’ అని వ్యాఖ్యానించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఓటరు జాబితా సవరణ సమయంలో తన ఓటు హక్కు తొలగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరిగి ఓటరు గుర్తింపు కార్డు పొందేందుకు ఎలాంటి ప్రక్రియను పూర్తి చేయాలి, ఎలాంటి పత్రాలు సమర్పించాలంటూ ఆయన ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా, ప్రకాశ్‌రాజ్‌పై గతంలో పలు ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ కేసులో బెంగళూరు కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయగా, గత నెలలో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ లభించింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో నాలుగు ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయని ఫిర్యాదుదారు ఆరోపించారు. అయితే ప్రస్తుత SIR ప్రక్రియలో తన పేరు తొలగించడంపై ప్రకాశ్‌రాజ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘‘ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించే హక్కు ప్రజలకు ఉంది. మీకు ఓటు వేయని కొందరి ఓటు హక్కును అధికారాన్ని ఉపయోగించి నిరాకరించవచ్చు. కానీ మా గొంతును ఆపలేరు. మా శక్తితో మిమ్మల్ని రాజకీయంగా కిందికి దించుతాం’’ అంటూ ప్రకాశ్‌రాజ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో జరుగుతున్న SIR ప్రక్రియలో బెంగళూరు వ్యవహారం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. ఇంటింటి ఓటరు వివరాల పరిశీలనలో గైర్హాజరు, వేరే ప్రాంతాలకు తరలిపోయిన, డూప్లికేట్‌, మరణించిన తదితర కారణాలతో ASDDO కేటగిరీలో భారీ సంఖ్యలో ఓటర్లను గుర్తించారు. కర్ణాటకలో మొత్తం 5.54 కోట్ల మంది ఓటర్లలో 1,09,83,901 మంది అంటే 19.81 శాతం మంది ASDDO కేటగిరీలో ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది.

బెంగళూరు అర్బన్‌లోనే అత్యధికంగా 17,74,626 ASDDO కేసులు నమోదయ్యాయి. అక్కడ SIRకు ముందు ఉన్న 40,21,039 మంది ఓటర్లలో ఇది 44.13 శాతంగా ఉంది. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (BBMP) సౌత్‌ పరిధిలో పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. అక్కడ 21,44,784 మంది ఓటర్లలో 10,87,829 మందిని ASDDO కేటగిరీలో గుర్తించారు. ఇది మొత్తం ఓటర్లలో 50.72 శాతానికి సమానం.

కర్ణాటకలో SIR గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. ఇంటింటి గణన ప్రక్రియ ఆగస్టు 17తో ముగియనుంది. ఆగస్టు 24న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుంది. అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణకు సెప్టెంబర్‌ 23 వరకు అవకాశం ఉంటుంది. అక్టోబర్‌ 22 వరకు వాటిని పరిష్కరించనున్నారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్‌ 27న ప్రకటించనున్నారు.

No comments:

Post a Comment

Featured post

ఎర్ర సముద్రంలో కార్గో నౌకపై హూతీ దాడి

ముగ్గురు సిబ్బంది మృతి సనా/దుబాయ్‌: ఎర్ర సముద్రంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. యెమెన్‌కు చెందిన ఇరాన్‌ అనుకూల హూతీ తిరుగుబాటుదారులు బ...