Monday, 24 August 2026

వీధి పోరాటాలతో రాహుల్‌కు పెరుగుతున్న ఆదరణ



  • ప్రతిపక్షాలను కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందంటున్న విశ్లేషకులు


న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ రాజకీయ శైలిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. పార్లమెంటరీ రాజకీయాలకే పరిమితం కాకుండా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వంపై నేరుగా పోరాటం చేయడం ఆయనకు కొత్త రాజకీయ బలాన్ని తెచ్చిపెడుతోంది. అయితే ఈ దూకుడును అతిగా ప్రదర్శించడం వల్ల విస్తృత ప్రతిపక్ష శిబిరంలో ఆయనపై ఉన్న నమ్మకానికి దెబ్బతగిలే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



జంతర్‌ మంతర్‌ ఘటన కీలక మలుపు


జూలై 20న జంతర్‌ మంతర్‌ వద్ద ప్రశ్నపత్రాల లీకేజీలను నిరసిస్తూ, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వేలాది మంది యువత ఆందోళన చేపట్టారు. పోలీసులు, పారామిలటరీ బలగాలు ఆందోళనకారులపై టియర్‌ గ్యాస్‌, లాఠీలతో దాడి చేయడంతో పాటు పెల్లెట్లు ప్రయోగించడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో సహిల్‌ లోచబ్‌ ఒకరు. పెల్లెట్ల కారణంగా ఆయన ఒక కన్ను చూపును కోల్పోయారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించడంతో రాహుల్‌ గాంధీ నేరుగా పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నిరసన చేపట్టారు. దాదాపు ఏడు గంటల పాటు అక్కడే ఉండి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించే వరకు వెనక్కి తగ్గలేదు. చివరకు పోలీసులు కేసు నమోదు చేయడం రాహుల్‌ గాంధీకి రాజకీయంగా   మైలేజీని తెచ్చిపెట్టింది. పార్లమెంటరీ రాజకీయాలతో పాటు వీధి పోరాటాన్ని సమర్థంగా మిళితం చేయగల నాయకుడిగా ఆయనకు కొత్త గుర్తింపు లభించిందనే విశ్లేషణలు వెలువడ్డాయి.



2014 తర్వాత మారిన రాహుల్‌ రాజకీయ ప్రస్థానం


2014లో నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్‌ గాంధీకి రాజకీయంగా అనేక సవాళ్లు ఎదురయ్యాయి. కాంగ్రెస్‌ బలహీనపడటం, సోనియా గాంధీ ప్రభావం నుంచి తనకంటూ ప్రత్యేక రాజకీయ గుర్తింపు తెచ్చుకోవడం ఆయనకు కష్టంగా మారింది. 2019లో అమేథీలో ఓడిపోయినా, కేరళలోని వయనాడ్‌ నుంచి గెలుపొందిన రాహుల్‌ రాజకీయంగా వెనక్కి తగ్గలేదు. 2024 లోక్‌సభ ఎన్నికలు ఆయనకు కీలక మలుపుగా మారాయి. బీజేపీ సొంత మెజారిటీ సాధించలేకపోగా.. కాంగ్రెస్‌ దాదాపు 100 స్థానాలకు చేరువైంది. రాహుల్‌ గాంధీ రెండు స్థానాల్లోనూ విజయం సాధించడం ఆయనకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అనంతరం రాష్ట్రాల్లో ప్రతిపక్ష కూటములకు ఎదురుదెబ్బలు తగిలినా, లోక్‌సభలో ప్రభుత్వంపై ఆయన దూకుడైన వైఖరి కొనసాగించారు.



వీధి ఉద్యమాలతో మరింత బలం


జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ఉద్యమం రాజకీయ సమీకరణాలను మరింతగా మార్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువత ఆందోళనలకు రాహుల్‌ గాంధీ బహిరంగంగా మద్దతు ఇవ్వడం, పోలీసుల చర్యలను ప్రశ్నించడం ఆయనకు ప్రజల్లో మరింత ఆదరణ తెచ్చిపెట్టింది. అయితే ఇక్కడే ఆయనకు అసలు సవాలు మొదలవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. యువత ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న ఇతర రాజకీయ, సామాజిక శక్తులను పూర్తిగా పక్కన పెట్టి, మొత్తం ఉద్యమాన్ని తన చుట్టూ తిప్పుకోవాలని ప్రయత్నిస్తే అది ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చని హెచ్చరిస్తున్నారు.


ప్రతిపక్ష ఐక్యతే కీలకం


కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీల మధ్య ఇప్పటికే అంతర్గత విభేదాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ తీసుకున్న రాజకీయ నిర్ణయాలు మిత్రపక్షాలను కూడా అసంతృప్తికి గురిచేశాయి. ప్రతిపక్ష శక్తులన్నింటినీ కలుపుకొని విస్తృత ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్మించాలంటే రాహుల్‌ గాంధీ మరింత సమన్వయ ధోరణిని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిన విషయాన్ని కూడా ఆ పార్టీ విస్మరించరాదని వారు సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, పాలన వంటి అంశాల్లో కాంగ్రెస్‌పై వచ్చిన విమర్శలు ఇప్పటికీ రాజకీయ చర్చలో ఉన్నాయని గుర్తుచేస్తున్నారు.


దూకుడు సరే.. అందరినీ కలుపుకోవాలి


ప్రస్తుతం బీజేపీపై దూకుడైన పోరాటం రాహుల్‌ గాంధీకి రాజకీయంగా కొత్త ఊపునిచ్చింది. అయితే ఈ అవకాశాన్ని నిలబెట్టుకోవాలంటే కేవలం ప్రభుత్వ వ్యతిరేకతకే పరిమితం కాకుండా, ఇతర ప్రతిపక్ష పార్టీలతోనూ సానుకూల సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.బీజేపీ బలహీనపడుతున్న పరిస్థితిని కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా మలుచుకోవాలంటే విభజన రాజకీయాలకు దూరంగా ఉండి విస్తృత ప్రజాస్వామ్య కూటమిని నిర్మించాల్సి ఉంటుంది. సోనియా గాంధీ గతంలో అనుసరించిన సమన్వయ రాజకీయ శైలిని రాహుల్‌ గాంధీ కూడా అనుసరిస్తేనే ఆయన ప్రస్తుత దూకుడు దీర్ఘకాలిక రాజకీయ బలంగా మారే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.

No comments:

Post a Comment

Featured post

అమెరికాలో వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్‌

ప్రపంచవ్యాప్తంగా సేవలు తాత్కాలికంగా నిలిపివేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలపై కఠిన చర్యలు ము...