జనగణన-2027లో దివ్యాంగుల లెక్కింపుపై అభ్యంతరాలు..
న్యూఢిల్లీ: జనగణన-2027లో దివ్యాంగుల వివరాలను నమోదు చేయనున్న విధానంపై దివ్యాంగుల హక్కుల సంఘాలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపాదిత జనగణన ఫారంలో కేవలం తొమ్మిది రకాల వైకల్యాలకు మాత్రమే చోటు కల్పించారని, అయితే దివ్యాంగుల హక్కుల చట్టం-2016 (RPwD Act) ప్రకారం 21 రకాల వైకల్యాలను గుర్తించిన విషయాన్ని వారు గుర్తుచేశారు. తొమ్మిది కేటగిరీలకే పరిమితం చేస్తే పలు వర్గాలు అధికారిక గణాంకాల్లో కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
నేషనల్ ప్లాట్‌ఫామ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద డిసేబుల్డ్ (NPRD) విడుదల చేసిన ప్రకటనకు 405 మంది సంతకాలు చేశారు. ప్రతిపాదిత జనగణనలో చూపు, వినికిడి, మాట, కదలిక, మేధో వైకల్యం, మానసిక అనారోగ్యం, యాసిడ్ దాడి బాధితులు, దీర్ఘకాలిక నాడీ సంబంధిత వ్యాధులు, రక్త సంబంధిత వ్యాధులు అనే తొమ్మిది కేటగిరీలను ప్రతిపాదించినట్లు వారు తెలిపారు.
వీటిలో తొలి ఆరు కేటగిరీలు 2011 జనగణనలోనూ ఉన్నాయని, అయితే ‘మెంటల్ రిటార్డేషన్’ స్థానంలో ‘ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ’ అనే పదాన్ని ఉపయోగించారని సంఘాలు పేర్కొన్నాయి. యాసిడ్ దాడులు, దీర్ఘకాలిక నాడీ సంబంధిత వ్యాధులు, రక్త సంబంధిత వ్యాధులను అదనంగా చేర్చినట్లు తెలిపాయి.
అయితే RPwD చట్టం ప్రకారం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, నిర్దిష్ట అభ్యసన వైకల్యాలు, సెరిబ్రల్ పాల్సీ, మస్క్యులర్ డిస్ట్రోఫీ, మల్టిపుల్ స్క్లెరోసిస్, పార్కిన్సన్స్ వ్యాధి, హీమోఫీలియా, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, డెఫ్‌బ్లైండ్‌నెస్‌తో కూడిన బహుళ వైకల్యాలు సహా మొత్తం 21 రకాల వైకల్యాలను గుర్తించారు.
ప్రతిపాదిత కేటగిరీల్లో ఆటిజం, నిర్దిష్ట అభ్యసన వైకల్యాలు, మరుగుజ్జుతనం, కుష్ఠు వ్యాధి నుంచి కోలుకున్నవారు, డెఫ్‌బ్లైండ్‌నెస్ సహా బహుళ వైకల్యాలకు ప్రత్యేకంగా చోటు కల్పించలేదని సంఘాలు ఆక్షేపించాయి. సెరిబ్రల్ పాల్సీ, మస్క్యులర్ డిస్ట్రోఫీ, మల్టిపుల్ స్క్లెరోసిస్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులను విస్తృత కేటగిరీల్లో కలిపేయడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశాయి. అలాగే తలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ వ్యాధులను ఒకే ‘బ్లడ్ డిజార్డర్’ కేటగిరీలో చేర్చడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నాయి.
ఇలాంటి వర్గీకరణ వల్ల జనగణన గణాంకాల కచ్చితత్వమే కాకుండా, భవిష్యత్తులో ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంక్షేమ పథకాల ప్రణాళిక, బడ్జెట్ కేటాయింపులు, ప్రభుత్వ జవాబుదారీతనంపైనా ప్రభావం పడుతుందని సంఘాలు హెచ్చరించాయి. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించే సిబ్బందికి కూడా స్పష్టత లేకుండా పోయే అవకాశం ఉందని, ఫలితంగా కొన్ని దివ్యాంగుల వర్గాలు అధికారిక గణాంకాల్లో పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని తెలిపాయి.
దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి రాందాస్ అథవాలే గతంలో 21 రకాల వైకల్యాలకు సంబంధించిన వివరాలను జనగణనలో నమోదు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని సంఘాలు ప్రస్తావించాయి. అయితే ప్రస్తుతం వెల్లడైన తొమ్మిది కేటగిరీల విధానం ఆ హామీకి విరుద్ధంగా ఉందని పేర్కొన్నాయి.
జనగణన-2027లో RPwD చట్టం గుర్తించిన మొత్తం 21 రకాల వైకల్యాలను విడివిడిగా నమోదు చేసేలా ప్రశ్నావళిని రూపొందించాలని దివ్యాంగుల హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. దివ్యాంగుల హక్కుల చట్టం ద్వారా సాధించిన పురోగతిని జనగణన ప్రతిబింబించాలి తప్ప, పాతకాలపు, అసమగ్ర వర్గీకరణలను కొనసాగించకూడదని స్పష్టం చేశాయి. ఈ డిమాండ్‌కు డిసెబిలిటీ రైట్స్ అలయన్స్, సెన్స్ ఇంటర్నేషనల్ ఇండియా, యాక్షన్ ఫర్ ఆటిజం, శ్రుతి డిసెబిలిటీ రైట్స్ సెంటర్, డిసెబిలిటీ రైట్స్ అసోసియేషన్ ఆఫ్ గోవా, నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ తదితర సంస్థల ప్రతినిధులు, పరిశోధకులు, హక్కుల కార్యకర్తలు మద్దతు తెలిపారు.
No comments:
Post a Comment