కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ నిర్వహణ తీరును పూర్తిగా అపహాస్యం చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో నియంతృత్వ ధోరణిని అవలంబిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేసి, తమ ఇష్టానుసారం సభను నడుపుతున్నారని ఆరోపించారు.
ప్రజా సమస్యలపై చర్చించేందుకు అవకాశం ఇవ్వకపోవడంతోనే తాము ఇవాళ ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించామని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు తమ వద్దకు వచ్చిన ప్రజా సమస్యలన్నింటినీ ఈ మాక్ అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు.
22ఏ చట్టం పేరుతో భారీ అవినీతి
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఉన్న పరిస్థితులతో పోలిస్తే.. ప్రభుత్వం మారిన తర్వాత 22ఏ చట్టం పరిధిలో నిషేధిత రిజిస్ట్రేషన్ భూముల సంఖ్య భారీగా పెరిగిందని కేటీఆర్ ఆరోపించారు. 22ఏ చట్టాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. ఇతర రంగాల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, వాటిని కూడా మాక్ అసెంబ్లీలో ప్రస్తావించామని తెలిపారు.
సీఎం సోదరుడికి రూ.200 కోట్ల భూమి రూ.7.5 కోట్లకే?
ముఖ్యమంత్రి సోదరుడికి సుమారు రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7.5 కోట్లకే కేటాయించే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఇది భారీ అవినీతికి నిదర్శనమని విమర్శించారు.
ప్రజా సమస్యలను లేవనెత్తేందుకే ప్రజలు తమను ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తమను తిరిగి అసెంబ్లీకి ఆహ్వానించి, ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించే అవకాశం కల్పించాలని కోరారు.
No comments:
Post a Comment