- భిన్నభావాల ప్రపంచంలోనూ ఏకాభిప్రాయం: జైశంకర్
- మోదీ భారత్ సత్తాను చాటిన సదస్సు.. 32 ప్రతినిధి బృందాల హాజరు
- పశ్చిమాసియా సంక్షోభంపై అందరి ఆమోదంతో సంయుక్త ప్రకటన
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14:బ్రిక్స్ భారత్ సదస్సు-2026 విజయవంతంగా ముగిసిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ప్రపంచం తీవ్ర వ్యతిరేక భావాలు లోనైన సమయంలోనూ వివిధ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించగలిగామని పేర్కొన్నారు. సదస్సుకు 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాలు, నాలుగు ప్రాంతీయ సంస్థలు, ఏడు అంతర్జాతీయ సంస్థలు కలిపి మొత్తం 32 ప్రతినిధి బృందాలు హాజరయ్యాయని జైశంకర్ తెలిపారు. ఎక్కువ మంది దేశాధినేతలు, ప్రభుత్వాధినేతల స్థాయిలో పాల్గొన్నారని, ప్రధాని మోదీతో వారందరికీ మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ప్రపంచం రెండు ప్రధాన యుద్ధాలు, తీవ్ర విభేదాలు, భిన్నమైన రాజకీయ ప్రయోజనాలతో రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితుల్లో సదస్సు జరిగిందని జైశంకర్ పేర్కొన్నారు. అయినప్పటికీ బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించగలిగామని చెప్పారు. గత మేలో ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఉమ్మడి ప్రకటన వెలువడకపోగా, ఈసారి విస్తృత చర్చల అనంతరం నేతలు ఏకగ్రీవంగా ఉమ్మడి ప్రకటనను ఆమోదించారు. ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభంపై అందరి అంగీకారంతో ప్రకటన విడుదల కావడం కీలక విజయమని జైశంకర్ అన్నారు. శాంతి, భద్రత, సుస్థిరత, దీర్ఘకాలిక అవగాహన కోసం కృషి చేయాలని, ప్రపంచ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలు, ఇంధన ప్రవాహాలు సజావుగా కొనసాగాలని, పౌరులు, పౌర మౌలిక సదుపాయాలకు రక్షణ కల్పించాలని బ్రిక్స్ పిలుపునిచ్చిందని తెలిపారు. భిన్నభావాలు తీవ్రంగా ఉన్నప్పటికీ ఇలాంటి కీలక అంశాలపై అన్ని దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా అంతర్జాతీయ వేదికపై భారత్ తన దౌత్య సామర్థ్యాన్ని చాటుకుందని జైశంకర్ పేర్కొన్నారు.
No comments:
Post a Comment