- అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకల్లో ట్రంప్
- 107 డిగ్రీల రికార్డు ఎండలో 80 నిమిషాల పాటు ప్రసంగం
- అమెరికా ప్రయోగం ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతం
- వాషింగ్టన్ వేడుకలు ముగిశాక నెతన్యాహుతో భేటీ కానున్నట్లు వైట్ హౌస్ వెల్లడి!
అమెరికా దేశం ఆవిర్భవించి 250 వసంతాలు పూర్తయిన చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన ‘సల్యూట్ టు అమెరికా’ వేడుకల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేశపూరిత, జాతీయవాద ప్రసంగం చేశారు. వాషింగ్టన్ నగర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 107 డిగ్రీల ఫారెన్‌హీట్ (42 డిగ్రీల సెల్సియస్) రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలతో వడగాల్పులు వీస్తున్నప్పటికీ, ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సుదీర్ఘంగా ప్రసంగించారు. మానవ స్వేచ్ఛకు, హక్కులకు అమెరికా ఒక గొప్ప నిదర్శనమని, ప్రపంచ చరిత్రలోనే ఇది అత్యంత అద్భుతమైన ప్రయోగమని ఆయన కొనియాడారు. వాషింగ్టన్ మాన్యుమెంట్ సాక్షిగా నేషనల్ మాల్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ప్రసంగిస్తూ.. 250 ఏళ్ల కిందట కొంతమంది దేశభక్తులు కలిసి స్వేచ్ఛతో, శ్రామికుల కష్టంతో, దేవుడి ఆశీస్సులతో నిర్మించిన ఈ దేశం.. నేడు మునుపెన్నడూ లేనంత బలంగా, పటిష్టమైన ఆత్మవిశ్వాసంతో ఉందని, అమెరికా స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ఎప్పటికీ వర్ధిల్లాలని ట్రంప్ నినదించారు.
సుమారు 80 నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగంలో ట్రంప్ చరిత్ర విశేషాలను గుర్తుచేస్తూనే, తన శైలిలో రాజకీయ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించారు. అమెరికా సైనిక వీరులను, పారిశ్రామిక ఆవిష్కర్తలను ఆకాశానికెత్తిన ఆయన.. అమెరికా గొప్పదనాన్ని గుర్తించని అంతర్జాతీయ సంస్థలను, దేశీయ రాజకీయ శత్రువులను తీవ్రంగా తప్పుపట్టారు. అమెరికాలోని 50 రాష్ట్రాల సంస్కృతి, వ్యవసాయ రంగాన్ని ప్రతిబింబించేలా ట్రంప్ ఆలోచనల ప్రకారం నేషనల్ మాల్ లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘గ్రేట్ అమెరికన్ స్టేట్ ఫెయిర్’ ప్రదర్శనకు ఎండతీవ్రత పెద్ద శాపంగా మారింది. వడదెబ్బ కారణంగా డజన్ల కొద్దీ సందర్శకులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అత్యవసర వైద్య సిబ్బంది వారికి చికిత్స అందించారు. మధ్యాహ్నం వేళలో ఎండ తీవ్రతకు జనాలు రాక అనేక రాష్ట్రాల పవిలియన్లు వెలవెలబోయాయి. అయినప్పటికీ స్టేజీపై ఏమాత్రం అలసట లేకుండా కనిపించిన ట్రంప్.. ఎండ ఎక్కువగా ఉంటుందని తనతో అన్నారని, కానీ భూమిపైనే అత్యంత గొప్ప దేశ వేడుకలను జరుపుకుంటున్నప్పుడు అమెరికా దేశభక్తులకు ఈ చిన్న ఎండ ఒక లెక్కే కాదని అనడంతో ముందు వరుసలోని మద్దతుదారులు పెద్ద ఎత్తున కేకలు వేశారు.
అంతర్జాతీయ వ్యవహారాల గురించి మాట్లాడుతూ.. తన పరిపాలన ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని ట్రంప్ పునరుద్ఘాటించారు. ప్రపంచ స్థిరత్వం అనేది కేవలం అమెరికా ఆర్థిక స్థితిస్థాపకత ,సైనిక ఆధిపత్యంపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న దౌత్యపరమైన చర్చలను ప్రస్తావిస్తూ.. ప్రత్యర్థి దేశాలు అమెరికా అపారమైన క్తిని పూర్తిగా అంగీకరించాయని పేర్కొన్నారు. సాయంత్రం చీకటి పడే సమయానికి ట్రంప్ ప్రసంగం ముగియడంతో.. అమెరికా చరిత్రలోనే అతిపెద్దదిగా అభివర్ణించిన బహుళ నగరాల సమన్వయ భారీ బాణసంచా ప్రదర్శనకు వేదిక సిద్ధమైంది. కాగా, ఈ వాషింగ్టన్ వేడుకల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరగబోయే అత్యంత కీలకమైన ద్వైపాక్షిక సమావేశానికి సిద్ధమవడానికి అధ్యక్షుడు ట్రంప్ ఒక రహస్య ప్రాంతానికి బయలుదేరనున్నట్లు వైట్ హౌస్ అధికారులు ధృవీకరించారు. శుక్రవారం జరిగిన టెలిఫోన్ సంభాషణలో ఇరు దేశాల అధినేతలు ఈ భేటీకి అంగీకరించినట్లు సమాచారం.
No comments:
Post a Comment