Thursday, 30 July 2026

దక్షిణాది గానకోకిల జమునారాణి కన్నుమూత


  • ‘ఓ దేవదా’ గాయని మధుర స్వరానికి శాశ్వత వీడ్కోలు



దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నేపథ్య గాయని కోకా జమునారాణి కన్నుమూశారు. ఆమె వయస్సు 88 సంవత్సరాలు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీత రంగం ఓ గొప్ప గాయనిని కోల్పోయింది.

1938లో ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన జమునారాణి.. ఏడేళ్ల వయస్సులోనే 1946లో విడుదలైన తెలుగు క్లాసిక్ చిత్రం ‘త్యాగయ్య’ ద్వారా సినీ గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం 1940ల నుంచి 1960ల వరకు దక్షిణ భారత సినీ సంగీత రంగంలో అగ్రగామి గాయనిగా వెలుగొందారు. తన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సింహళ భాషల్లో కలిపి 6,000కు పైగా పాటలు ఆలపించి అరుదైన రికార్డు సృష్టించారు. 1980ల వరకు కూడా ఆమె గాన సేవలు కొనసాగాయి. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘నాయకుడు’ చిత్రంలో ఇళయరాజా స్వరపరిచిన “నా నవ్వే దీపావళి” ఆమె చివరి దశలో గుర్తుండిపోయే పాటల్లో ఒకటి. తెలుగులో ద్రోహి, రత్నమాల, లైలా మజ్ను, చంద్రిరాణి, దేవదాసు, సంతానం, ఆలీబాబా 40 దొంగలు, వద్దంటే పెళ్లి, బడి పంతులు, అన్నదమ్ముడు, బంగారు తిమ్మరాజు వంటి ఎన్నో చిత్రాలకు ఆమె తన స్వరాన్ని అందించారు.


ఆమె ఆలపించిన “ఓ దేవదా”, “చెలియా లేదు” (దేవదాసు), “పద పదవే వయ్యారి గాలిపటమా” (అభిమానం), “నాగమల్లి కోనలోన నక్కింది లేడీ కూన” (బంగారు తిమ్మరాజు), “మామా మామా మామా ఏమే ఏమే భామా” (మంచి మనుషులు), “శారద శారద సిగరెట్టు” (రాముడు-భీముడు), “విరిసే చల్లని వెన్నెల” (లవకుశ) వంటి పాటలు నేటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉన్నాయి.తెలుగు మాత్రమే కాకుండా తమిళ సినీ పరిశ్రమలో కూడా జమునారాణి విశేష గుర్తింపు పొందారు. విభిన్న భావాలను ఆవిష్కరించే ఆమె గాత్రం, మాధుర్యం, స్పష్టమైన ఉచ్చారణ ఆమెను దక్షిణాది సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టాయి. ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా భావిస్తున్నారు.

No comments:

Post a Comment

Featured post

రాష్ట్రపతి ‘ఎట్ హోమ్’ ఆహ్వాన పత్రికలో భారత కళా వైభవం

మహేశ్వరి చేనేత నుంచి గోవా అజులేజో కళ వరకు విశేష ఆకర్షణ న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఆగస్టు 15న నిర్వహించే ...