- నెహ్రూ, సుకర్ణోల బాండుంగ్ సదస్సును గుర్తుచేస్తూ భిన్నత్వంలో ఏకత్వానికి జైకొట్టిన ప్రధాని
- ఇండోనేషియా స్వాతంత్య్ర పోరాటంలో బిజూ పట్నాయక్ సాహసాన్ని కొనియాడిన మోదీ
- బ్రహ్మోస్ క్షిపణులు, యూపీఐ-క్యూఆర్ఐఎస్ అనుసంధానం , ‘సెయిల్’ ఉమ్మడి ప్రాజెక్టులతో దౌత్య, ఆర్థికరంగాల్లో సరికొత్త రికార్డు!
ఇండోనేషియా పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారు. మంగళవారం నాటి తన చరిత్రాత్మక ప్రసంగంలో భారత్, ఇండోనేషియా దేశాల ప్రజాస్వామ్యాల్లో ‘భిన్నత్వంలో ఏకత్వమే’ జాతీయ సమగ్రతకు బలమైన పునాదిగా నిలిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రాచీన, ఆధునిక బంధాలను గుర్తుచేస్తూ.. ఐక్యరాజ్యసమితి వేదికగా ఇండోనేషియా స్వాతంత్య్ర కాంక్షకు భారతదేశం ఎలా బలమైన గొంతుకగా నిలిచిందో ఆయన వివరించారు. 1950లో భారత్ తన మొదటి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడు, ఆ చారిత్రక వేడుకకు ఇండోనేషియా వ్యవస్థాపక అధ్యక్షుడు సుకర్ణో ముఖ్యఅతిథిగా హాజరయ్యారని ప్రధాని గుర్తుచేశారు. ఆ తర్వాతి కాలంలో 1955 నాటి చరిత్రాత్మక ‘బాండుంగ్ సదస్సు’లో అధ్యక్షుడు సుకర్ణో, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూలు కలిసి.. వలసపాలన నుంచి విముక్తి పొందిన స్వతంత్ర దేశాలకు తమ స్వంత నిర్ణయాలు తీసుకునే సార్వభౌమాధికారం ఉందని ప్రపంచానికి చాటిచెప్పారని మోదీ కొనియాడారు.
వలసపాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆసియా, ఆఫ్రికా దేశాల మధ్య సహకారాన్ని పెంచుతూ ‘అలీన విధానానికి’ (Non-Aligned Movement) బాండుంగ్ సదస్సే బీజం వేసిందని ప్రధాని పేర్కొన్నారు. ఇరు దేశాల పూర్వీకులు కలిసి ఎన్నో అనుభవాలను పంచుకున్నారని, ఇండోనేషియా 1945లో, భారత్ 1947లో దాదాపు ఒకే సమయంలో విదేశీ పాలన నుంచి స్వాతంత్య్రం పొందాయని చెప్పారు. ఈ సందర్భంగా ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ పైలట్ బిజూ పట్నాయక్ , ఆయన భార్య జ్ఞానవతి పట్నాయక్ చూపిన అసాధారణ సాహసాన్ని ప్రధాని పార్లమెంట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 1945 ఆగస్టు 17న డచ్ పాలన నుంచి ఇండోనేషియా స్వాతంత్య్రం ప్రకటించుకున్న తరుణంలో.. డచ్ సైన్యం విమానాన్ని కూల్చేస్తామని బెదిరించినప్పటికీ భయపడకుండా, బిజూ పట్నాయక్ దంపతులు తమ ‘డకోటా’ విమానంలో ఇండోనేషియా ప్రధాని సుతాన్ షహ్రీర్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ హట్టాలను సురక్షితంగా ఢిల్లీకి చేర్చిన ఉదంతాన్ని మోదీ గుర్తుచేసుకోవడంతో పార్లమెంట్ హర్షధ్వనులతో మార్మోగింది.
ప్రధాని మోదీ , ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో రక్షణ, ఆర్థిక రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరు దేశాల రక్షణ బంధాన్ని తదుపరిస్థాయికి తీసుకెళ్లేలా ‘బ్రహ్మోస్’ (BrahMos) క్షిపణి వ్యవస్థల సరఫరాపై చర్చించడంతో పాటు, భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ‘యూపీఐ’ (UPI) ని ఇండోనేషియా ‘క్యూఆర్ఐఎస్’ (QRIS) పేమెంట్ నెట్‌వర్క్‌తో అనుసంధానించే ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా గనులు, వ్యూహాత్మక ఖనిజాల సరఫరా గొలుసును బలోపేతం చేసేందుకు ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా.. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ‘స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ (SAIL), ఇండోనేషియాకు చెందిన ‘పీటీ క్రాకటావో స్టీల్’ సంస్థతో కలిసి ఇండోనేషియాలోనే ఒక భారీ స్టెయిన్‌లెస్ స్టీల్ స్లాబ్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి వ్యూహాత్మక జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఇండోనేషియా ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందుతూ లక్షలాదిమందిని పేదరికం నుంచి దూరం చేసిందని, అదే తరహాలో భారతదేశం కూడా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా నిలిచిందని, గత పదేళ్లలో 25 కోట్లకు పైగా భారతీయులు పేదరికం నుంచి విముక్తి పొందారని ప్రధాని మోదీ సగర్వంగా ప్రకటించారు.
No comments:
Post a Comment