Thursday, 23 July 2026

విద్యార్థుల ఆందోళనకు మురళీ మనోహర్ జోషి మద్దతు

 

  • పోలీసుల బలప్రయోగంపై బీజేపీ సీనియర్ నేత తీవ్ర ఆగ్రహం




నీట్ (NEET) ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన బాట పట్టిన విద్యార్థులకు బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి గురువారం తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పిలుపునిచ్చిన 'సంసద్ చలో' నిరసన ప్రదర్శన సందర్భంగా ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) బలగాలు విద్యార్థులపై చూపించిన విచక్షణా రహిత అణచివేత వైఖరిని, బలప్రయోగాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

ఈ విచారకర ఘటనపై 92 ఏళ్ల వయోవృద్ధ నాయకుడు జోషి 'ఎక్స్' (X) వేదికగా స్పందిస్తూ.. ఆందోళన చేస్తున్న చిన్న వయసు అమ్మాయిలను కూడా పోలీసులు అత్యంత దారుణంగా కొట్టడం, విచక్షణారహితంగా వ్యవహరించడం తనను ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు విద్యార్థులపై ఇలాంటి విచక్షణా రహితమైన బలప్రయోగానికి దిగడం వల్ల దేశంలోని మెజారిటీ ప్రజలు, ముఖ్యంగా యువత.. ప్రధాని మోడీ ఆకాంక్షించే 'వికసిత్ భారత్' జాతీయ లక్ష్యానికి దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కేంద్రంలో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో (1998-2004) విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న జోషి, దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం అనేక రోజులుగా రాజధాని ఢిల్లీ వీధుల్లో కాలం వెళ్లదీయడం చూస్తుంటే తనకు ఎంతో బాధగా ఉందన్నారు. నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం , విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఢిల్లీలో నిరసనలు ఉధృతమవుతున్న తరుణంలో సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.


No comments:

Post a Comment

Featured post

విద్యార్థుల ఆందోళనకు మురళీ మనోహర్ జోషి మద్దతు

  పోలీసుల బలప్రయోగంపై బీజేపీ సీనియర్ నేత తీవ్ర ఆగ్రహం నీట్ (NEET) ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన బాట పట్ట...