Thursday, 5 March 2026

ట్రంప్ మాస్ వార్నింగ్


  • 'ముందు ఇరాన్.. తర్వాతే క్యూబా'
  • మూడు రోజుల్లోనే 24 నౌకలు ధ్వంసం!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ప్రత్యర్థి దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంపై స్పందిస్తూ.. అమెరికా తదుపరి లక్ష్యం క్యూబా అని ఆయన స్పష్టం చేశారు. "ముందు ఇరాన్ పని ముగిస్తాం.. ఆ తర్వాతే క్యూబా సంగతి చూస్తాం" అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యూబా ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్ర ముప్పుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే క్యూబాపై చర్యలు ఎప్పుడు ఉంటాయనేది మాత్రం ఆయన వెల్లడించలేదు.



ఇరాన్‌పై జరుగుతున్న దాడుల గురించి వివరిస్తూ.. ఇజ్రాయెల్ దళాలతో కలిసి అమెరికా సైన్యం అనుకున్న దానికంటే వేగంగా లక్ష్యాలను చేరుకుంటోందని ట్రంప్ పేర్కొన్నారు. వరుస వైమానిక దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా క్షీణించిందని, అమెరికాను ఎదుర్కొనే స్థాయి వైమానిక దళం ఇరాన్ వద్ద లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఇరాన్ నావికాదళాన్ని తాము నాశనం చేశామని, కేవలం మూడు రోజుల్లోనే ఆ దేశానికి చెందిన 24 యుద్ధ నౌకలను తుడిచిపెట్టామని ఆయన ప్రకటించారు.


ఈ పరిణామాలతో ఇరాన్ అధికారులు దిగివచ్చారని, అణు ఒప్పందంపై చర్చలకు తాము సిద్ధమని రాయబారాలు పంపుతున్నారని ట్రంప్ వెల్లడించారు. "ఇరాన్ అధికారులు ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చారు.. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందని నేను వారికి చెప్పాను" అని ఆయన పేర్కొన్నారు. టెహ్రాన్ రాజకీయ భవిష్యత్తును మార్చడంలో అక్కడి దౌత్యవేత్తలు తమకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో ఆపరేషన్ ముగిసిన తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో పెను మార్పులు ఉంటాయని, క్యూబా కూడా తమతో ఒప్పందం కోసం ఎదురుచూస్తోందని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

No comments:

Post a Comment

Featured post

ట్రంప్ మాస్ వార్నింగ్

'ముందు ఇరాన్.. తర్వాతే క్యూబా' మూడు రోజుల్లోనే 24 నౌకలు ధ్వంసం! వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ...