Monday, 30 March 2026

పినరయి విజయన్ రిమోట్ కంట్రోల్ మోడీ చేతిలోనే


  • కేరళలో  కార్పొరేట్ సంస్థగా మారిన ఎల్డీఎఫ్ ప్రభుత్వం
  •  రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!


కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పతనంతిట్టలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ అధికార ఎల్డీఎఫ్ (LDF) కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం తన సిద్ధాంతాలను పక్కనబెట్టి ‘కార్పొరేట్ నిధులతో నడిచే ప్రభుత్వం’గా మారిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ నియంత్రిస్తున్నారని, విజయన్ అవినీతికి సంబంధించిన ఫైళ్లు మోడీ వద్ద ఉండటమే ఇందుకు కారణమని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకించే నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు పెడుతుంటే, కేరళ ముఖ్యమంత్రిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఈ రహస్య ఒప్పందానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.



ఎన్నికల బరిలో ఎల్డీఎఫ్ , బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని, యూడీఎఫ్ (UDF) కూటమిని ఓడించడమే లక్ష్యంగా ఈ ‘అపవిత్ర కలయిక’ ఏర్పడిందని రాహుల్ గాంధీ విమర్శించారు. శబరిమల ఆలయ బంగారం దొంగతనం వంటి కీలక అంశాలను నిన్న కేరళలో పర్యటించిన ప్రధాని మోడీ ప్రస్తావించకపోవడం వెనుక ఉన్న అంతర్యాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం సామాన్యుల ప్రయోజనాలను విస్మరించి కేవలం కార్పొరేట్శక్తులకే కొమ్ముకాస్తోందని, కాంగ్రెస్ మాత్రమే బీజేపీని , వారి రహస్య మిత్రులను ఢీకొట్టగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 9న జరగనున్న ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, యూడీఎఫ్ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , వృద్ధులకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం వంటి పథకాలను అమలుచేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment

Featured post

హేట్ స్పీచ్ బిల్లు ప్రజాస్వామ్యానికి డెత్ వారెంట్

అసెంబ్లీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎల్పీ నేత ధ్వజం బిల్లును సెలక్షన్ కమిటీకి పంపాలని డిమాండ్ హైదరాబాద్‌: తెలంగాణ...