ట్రాఫిక్ కెమెరాల నిఘా.. మోసాద్ మాయాజాలం
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంతానికి అమెరికా, ఇజ్రాయెల్ పక్కా స్కెచ్!
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీని హతమార్చేందుకు అమెరికా ,ఇజ్రాయెల్ గూఢచారి సంస్థలు ఏళ్ల తరబడి అత్యంత రహస్యంగా, సాంకేతికంగా శ్రమించాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా టెహ్రాన్‌లోని పాశ్చర్ స్ట్రీట్ సమీపంలోని ట్రాఫిక్ కెమెరాలను ఇజ్రాయెల్ హ్యాక్ చేయడం ఈ ఆపరేషన్‌లో కీలక మలుపుగా మారింది. ఖమేనీ నివసించే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలోని ఒక కెమెరా ద్వారా ఇజ్రాయెల్ నిఘావర్గాలు అక్కడి పౌర కార్యకలాపాలను నిశితంగా గమనించాయి. కాంప్లెక్స్ అల్గారిథమ్స్ సహాయంతో ఖమేనీ రక్షణ సిబ్బంది , అడ్రస్‌లు, వారి డ్యూటీ సమయాలు, వారు ప్రయాణించే మార్గాలను విశ్లేషించి ‘ప్యాటర్న్ ఆఫ్ లైఫ్’ పేరుతో ఒక సమగ్ర నివేదికను రూపొందించుకున్నాయి. తద్వారా శనివారం ఉదయం ఖమేనీ తన కార్యాలయంలో ఎప్పుడు ఉంటారు, ఎవరిని కలుస్తారు అనే విషయాన్ని ఇజ్రాయెల్ , సీఐఏ (CIA) కచ్చితంగా అంచనా వేయగలిగాయి.
ఈ ఆపరేషన్ కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, మోసాద్ క్షేత్రస్థాయిలో నియమించుకున్న మానవ వనరుల (Human Assets) ప్రతిభ కూడా. ఫోన్ సిగ్నల్స్ అందకుండా పాశ్చర్ స్ట్రీట్ సమీపంలోని మొబైల్ టవర్లను ఇజ్రాయెల్ యూనిట్ 8200 నిలిపివేయడంతో, దాడి సమయంలో ఖమేనీ రక్షణ బృందానికి ఎటువంటి హెచ్చరికలు అందలేదు. మరోవైపు, అమెరికా వద్ద ఉన్న ఒక రహస్య మానవ మూలం (Human Source) ద్వారా ఖమేనీ ఆ సమయంలో అక్కడే ఉన్నారని బలమైన సమాచారం అందింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమారు 200 యుద్ధ విమానాలు 500 లక్ష్యాలపై విరుచుకుపడి ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేశాయి. ఇరాన్ నాయకులు అల్పాహారం తీసుకుంటున్న సమయంలోనే ఈ మెరుపు దాడి జరిగినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
హిజ్బుల్లా నేత నస్రల్లా లాగా ఖమేనీ ఎప్పుడూ బంకర్లలో దాక్కోలేదు, బహిరంగంగానే తిరిగేవారు. యుద్ధం మొదలైన తర్వాత ఆయనను పట్టుకోవడం కష్టమని భావించి, అగ్రనాయకత్వమంతా ఒకే చోట ఉన్న సమయంలోనే ఈ భారీ దాడిని ముగించారు. ఇజ్రాయెల్ పైలట్లు ‘స్పారో’ (Sparrow) అనే అధునాతన క్షిపణులను వాడి 1,000 కిలోమీటర్ల దూరం నుంచి కూడా అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించారు. ఈ దెబ్బతో ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన నాయకుడిని కోల్పోవడమే కాకుండా, తన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంతలా దెబ్బతిన్నదో అర్థం చేసుకోలేక దిగ్భ్రాంతిలో మునిగిపోయింది.
No comments:
Post a Comment