న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: ‘సేవా సంకల్ప్’, జన భాగస్వామ్యం స్ఫూర్తితో స్వచ్ఛతా హి సేవా 2026 కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్‌లాల్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పిలుపునిచ్చారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
స్వచ్ఛతా హి సేవా 2026 నెల రోజుల కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మనోహర్‌లాల్ ఈరోజు సమీక్షించారు. గరిష్ఠ ప్రజా భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు కనిపించేలా చర్యలు తీసుకోవాలని, స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, ప్రవర్తనలో అంతర్భాగంగా మార్చేందుకు నిరంతర కృషి చేయాలని ఆయన సూచించారు.
అక్టోబర్ 1న నిర్వహించనున్న ‘ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్’ కార్యక్రమం ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి.. రాష్ట్రాలు పెద్దఎత్తున శ్రమదాన కార్యక్రమాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని, ఆ రోజు సాధించిన పరిశుభ్రత ఆ తర్వాత కూడా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పట్టణాభివృద్ధి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, యువత, సామాజిక సంస్థలను కార్యక్రమంలో చురుగ్గా భాగస్వామ్యం చేయాలని రాష్ట్రాలను కోరారు. 50 నగరాల్లో స్పష్టమైన పరిశుభ్రత, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, సురక్షిత పారిశుద్ధ్యం, జన భాగస్వామ్యంపై దృష్టి సారించనున్నారు. ఫలితాల ఆధారిత, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ చేపట్టనున్నారు.
No comments:
Post a Comment