- ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం
దేశంలోని మూడు కీలక ప్రాంతాలైన అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు కొత్త ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7 గంటల నుండే పోలింగ్ ప్రారంభం కానుండగా, ఎన్నికల కమిషన్ అన్నిచోట్లా స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన వాతావరణంలో ఓటింగ్ జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అస్సాంలోని 126 స్థానాలకు, కేరళలోని 140 స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాలకు ఈ దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మే 4వ తేదీన జరగనుంది.
కేరళలో సుమారు 2.71 కోట్ల మంది ఓటర్లు 883 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30,471 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 1.46 లక్షల మంది శిక్షణ పొందిన సిబ్బందిని విధుల్లో నియమించారు. అధికార ఎల్‌డిఎఫ్ (LDF) వరుసగా మూడవసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తుండగా, ప్రతిపక్ష యూడిఎఫ్ (UDF) , బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏ (NDA) తమ గెలుపుపై ధీమాతో ఉన్నాయి. అస్సాంలో కూడా 2.5 కోట్ల మంది ఓటర్లు 722 మంది అభ్యర్థులకు ఓటు వేయనున్నారు. ఇక్కడ మొత్తం 31,490 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించి, నిరంతరం నిఘా ఉంచేలా చర్యలు తీసుకున్నారు. బిజెపి నేతృత్వంలోని కూటమిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఆరు పార్టీలతో మహాకూటమిని ఏర్పాటు చేయడంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారింది.
పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో 10.14 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక్కడి 1,099 పోలింగ్ కేంద్రాలలో 209 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి, కేంద్ర సాయుధ బలగాల పహారాలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాహే, యానాం వంటి సుదూర ప్రాంతాలలో 4K నాణ్యత కలిగిన డ్రోన్ల ద్వారా లైవ్ ఫీడ్‌ను పర్యవేక్షించడం గమనార్హం. అధికార ఎన్‌డిఏ కూటమి , కాంగ్రెస్-డీఎంకే కూటమితో పాటు నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) కూడా బరిలో ఉండటంతో పుదుచ్చేరిలో త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా మద్యం దుకాణాలను మూసివేయడంతో పాటు, ప్రలోభాలను అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు చేపడుతున్నాయి.
No comments:
Post a Comment