- టెహ్రాన్‌పై అమెరికా ‘మెరుపు’ దాడి
- వందలాది క్షిపణులతో విరుచుకుపడ్డ ఆగ్రరాజ్య సేనలు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా దళాలు జరిపిన అత్యంత శక్తివంతమైన దాడిలో ఆ దేశ అగ్రశ్రేణి సైనిక నాయకత్వం అంతమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆదివారం తెల్లవారుజామున టెహ్రాన్‌లోని కీలక సైనిక స్థావరాలు, కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని వందలాది క్షిపణులు, డ్రోన్లతో అమెరికా మెరుపు దాడులు నిర్వహించింది. ఈ భారీ ఆపరేషన్‌లో ఇరాన్ సైనిక యంత్రాంగాన్ని నడిపించే ప్రధాన కమాండర్లు హతమయ్యారని, దీంతో ఆ దేశ యుద్ధ సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నదని వైట్ హౌస్ నుంచి విడుదల చేసిన ప్రకటనలో ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా పౌరులు, ప్రయోజనాలపై ఇరాన్ చేస్తున్న దాడులకు ఇది తగిన సమాధానమని ఆయన స్పష్టం చేశారు.
ఈ దాడి ఎంత తీవ్రంగా జరిగిందంటే, టెహ్రాన్ నగరం అంతటా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, అనేక సైనిక భవనాలు నేలమట్టమయ్యాయని స్థానిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు ఈ క్షిపణులను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అమెరికా తన అత్యాధునిక స్టెల్త్ బాంబర్లు , సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను ప్రయోగించడంతో భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ సైన్యానికి వెన్నెముకగా ఉన్న సీనియర్ జనరల్స్ ఈ దాడుల సమయంలో ఒక రహస్య సమావేశంలో ఉన్నట్లు సమాచారం, సరిగ్గా అదే సమయంలో అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ క్షిపణి దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ఇరాన్ అంతర్గత భద్రతను , పశ్చిమాసియాలోని భౌగోళిక రాజకీయాలను ఒక్కసారిగా మార్చివేసింది.
అమెరికా చేసిన ఈ ప్రకటనపై ఇరాన్ ఇంకా అధికారికంగా పూర్తి వివరాలను వెల్లడించలేదు, కానీ టెహ్రాన్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించి సరిహద్దులను మూసివేసింది. ఈ దాడితో ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పశ్చిమాసియాలో ఇప్పటికే రగులుతున్న యుద్ధ జ్వాలలకు ఈ ఘటన ఆజ్యం పోసినట్లయింది. అమెరికా తన సైనిక శక్తిని ఉపయోగించి ఇరాన్ నాయకత్వాన్ని దెబ్బతీయడం ద్వారా యుద్ధాన్ని ముగించాలని చూస్తుండగా, ఇది మరింత పెద్ద ఎత్తున ప్రతికార దాడులకు దారితీయవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.
No comments:
Post a Comment