Friday, 3 April 2026

మావోయిస్ట్ అగ్రనేత ప్రశాంత్ బోస్ కన్నుమూత


  • రాంచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన కిషన్ దా
  • ఆయనపై రూ. కోటి రివార్డు 



రాంచీ: నిషేధిత సిపిఐ (మావోయిస్ట్) పార్టీలో అగ్రస్థాయి నాయకుడు, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా (80) శుక్రవారం రాత్రి జార్ఖండ్‌లోని రాంచీలో కన్నుమూశారు.  కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు ,అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రశాంత్ బోస్ తలపై దాదాపు కోటి రూపాయల రివార్డు ఉంది. 2021 నవంబర్‌లో జార్ఖండ్ పోలీసులు ఆయనను, ఆయన భార్య శీలా మరాండీని సరాయికేలా ఖర్సావా జిల్లాలో అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అనారోగ్యం క్షీణించడంతో జైలు అధికారులు ఆయనను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతూనే ఆయన మరణించారు. ప్రశాంత్ బోస్ మరణం మావోయిస్ట్ పార్టీకి తీరని లోటుగా పరిగణించబడుతున్నది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆయన, దశాబ్దాల పాటు మావోయిస్ట్ భావజాల వ్యాప్తిలో , పార్టీ బలోపేతంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా జార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్ , ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్ట్ కార్యకలాపాలను పర్యవేక్షించే 'ఈస్టర్న్ రీజినల్ బ్యూరో'కు ఆయన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆయన అరెస్టు తర్వాత ఈ ప్రాంతాల్లో మావోయిస్ట్ పట్టు సడలిందని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఇప్పుడు ఆయన మరణంతో ఆ పార్టీ ఒక మేధావిని, వ్యూహకర్తను కోల్పోయినట్లయింది. 

No comments:

Post a Comment

Featured post

కీవ్‌పై రష్యా ‘హైపర్‌సోనిక్ ఒరెష్నిక్’ మిస్సైల్స్ తో దాడి

 కీవ్‌పై రష్యా ‘హైపర్‌సోనిక్ ఒరెష్నిక్’ మిస్సైల్స్ తో దాడి ఉక్రెయిన్ రాజధానిపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం కీవ్: రష్యా-ఉ...