పశ్చిమాసియా యుద్ధంతో ఇంధన సంక్షోభం!
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ఉద్రిక్తతల కారణంగా ఆసియా వ్యాప్తంగా సుమారు 50 ద్రవీకృత సహజ గ్యాస్ (LNG) ట్యాంకర్లు సముద్రం మధ్యలోనే ఖాళీగా నిలిచిపోయినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి గుండెకాయ వంటి ఖతార్‌లోని రస్ లఫాన్ (Ras Laffan) నగరంపై గత నెలలో ఇరాన్ జరిపిన దాడి ఈ సంక్షోభానికి ప్రధాన కారణమైంది. గత 20 ఏళ్లుగా ఎల్‌ఎన్‌జీ పరిశ్రమకు హబ్‌గా ఉన్న ఈ కేంద్రం నుంచి ఎగుమతులు నిలిచిపోవడంతో సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతిన్నది. హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరగడంతో ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఖతార్‌కు వెళ్లి గ్యాస్ నింపుకోవాల్సిన ట్యాంకర్లు మార్గమధ్యలోనే ఆగిపోయాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం ఈ ట్యాంకర్లలో ఒక్క చుక్క గ్యాస్ కూడా లేదు.
- ఎక్కడెక్కడ నిలిచిపోయాయంటే?
విమాన ప్రయాణాలు, పరిశ్రమలు, గృహ అవసరాలకు కీలకమైన గ్యాస్‌ను మోసుకెళ్లాల్సిన ఈ ట్యాంకర్లు ప్రస్తుతం పశ్చిమ భారత్, శ్రీలంక తీర ప్రాంతాల్లో. మలక్కా జలసంధికి ఉత్తర ప్రవేశద్వారం వద్ద. సింగపూర్‌కు తూర్పున ఉన్న జలాల్లో ఉండిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 800 ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లు నిర్వహణలో ఉండగా, అందులో 50 ట్యాంకర్లు ఒకేసారి ఖాళీగా నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. "ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రపంచ దేశాలు తమ నేచురల్ గ్యాస్ వాడకాన్ని తగ్గించుకోవాల్సిన లేదా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సిన అసాధారణ పరిస్థితి ఏర్పడింది." బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొన్నది. ఈ సరఫరా అంతరాయం కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
No comments:
Post a Comment