Friday, 3 April 2026

శశి థరూర్ కాన్వాయ్‌పై దాడి


  • ఎంపీ భద్రతా సిబ్బందిపై దాడి చేసిన ఆందోళనకారులు
  • మలప్పురంలో ఎన్నికల ప్రచారం వేళ ఉద్రిక్తత.. ముగ్గురు నిందితుల అరెస్ట్!



మలప్పురం: కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న కొందరు దుండగులు, ఆయన భద్రతా సిబ్బందిపై దాడికి దిగడం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి మలప్పురం జిల్లా వండూర్ పరిధిలోని తిరువల్లి చెల్లితోడు వంతెన సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శశి థరూర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా, నిందితులు ఆయన వాహనాన్ని చుట్టుముట్టి నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ భద్రతా అధికారిపై భౌతిక దాడి జరగగా, కారు ముందు సీట్లో కూర్చున్న థరూర్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై శనివారం ఉదయం శశి థరూర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తన భద్రతా సిబ్బంది క్షేమంగా ఉన్నారని, తనపై ఎలాంటి దాడి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఆందోళనకర పరిస్థితులు ఎదురైనప్పటికీ వెనక్కి తగ్గకుండా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం మిగిలిన రెండు కార్యక్రమాలను పూర్తి చేశామని, భవిష్యత్ ప్రచార కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన ప్రకటించారు. తన క్షేమం కోసం ఆరా తీసిన శ్రేయోభిలాషులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, భద్రతా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు వండూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో సంబంధం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారు వినియోగించిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కలికావు ప్రాంతానికి చెందిన ఉమ్మరా అనే వ్యక్తిపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేశారు. 

No comments:

Post a Comment

Featured post

కీవ్‌పై రష్యా ‘హైపర్‌సోనిక్ ఒరెష్నిక్’ మిస్సైల్స్ తో దాడి

 కీవ్‌పై రష్యా ‘హైపర్‌సోనిక్ ఒరెష్నిక్’ మిస్సైల్స్ తో దాడి ఉక్రెయిన్ రాజధానిపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం కీవ్: రష్యా-ఉ...