- కానీ 100 శాతం మహిళల మద్దతు ఉంది
- విపక్షాల తీరుపై ప్రధాని మోదీ ఆగ్రహం
మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం సాయంత్రం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం మహిళల హక్కులను కాలరాశాయని ధ్వజమెత్తారు. "పార్లమెంటులో ఈ బిల్లును ఓడించినందుకు కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీల నేతలు చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. వారు చప్పట్లు కొట్టింది బిల్లు వీగిపోయినందుకు కాదు, ఈ దేశ మహిళా శక్తికి దక్కాల్సిన గౌరవాన్ని అడ్డుకున్నందుకు. ఇది నారీశక్తి ఆత్మగౌరవంపై జరిగిన దాడి" అని మోదీ మండిపడ్డారు. బిల్లు ఆమోదానికి అవసరమైన 66 శాతం ఓట్లు తమకు సభలో లేకపోవచ్చు కానీ, దేశంలోని 100 శాతం మహిళా శక్తి తమ వెంటే ఉందన్న విషయం తనకు తెలుసని ఆయన ఉద్ఘాటించారు.
మహిళల పట్ల అన్యాయం చేసిన వారికి కాలమే శిక్ష విధిస్తుందని, ఈ 'పాపం' నుండి విపక్షాలు తప్పించుకోలేవని ప్రధాని హెచ్చరించారు. పార్లమెంటు హాల్‌లో మహిళల ఆశలను చిదిమేసి సంబరాలు చేసుకున్న నేతలను ఈ దేశ నారీ లోకం ఎప్పటికీ క్షమించదని, వారు తమ ఇళ్ల ముందుకు వచ్చినప్పుడు మహిళలు తప్పకుండా నిలదీస్తారని అన్నారు. మహిళా రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండీ చిత్తశుద్ధి లేదని, గత 40 ఏళ్లుగా ఏదో ఒక సాకుతో అడ్డుకుంటూనే ఉందని ఆరోపించారు. ఈసారి కూడా నిజాయితీతో కూడిన ఒక పవిత్ర ప్రయత్నాన్ని విపక్షాలు 'భ్రూణహత్య' చేశాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 21వ శతాబ్దపు మహిళలు ప్రతి కదలికను గమనిస్తున్నారని, విపక్షాల అసలు రంగు ఇప్పుడు బయటపడిందని ఆయన పేర్కొన్నారు.
లోక్‌సభలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, మహిళా సాధికారత విషయంలో తమ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని ప్రధాని స్పష్టం చేశారు. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళలకు సముచిత వాటా కల్పించాలనే సంకల్పంతో ఉన్నామని, దీనిపై భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తున్నామని తెలిపారు. దేశంలోని సగం జనాభాకు సమాన భాగస్వామ్యం కల్పించడం ద్వారానే నవ భారత నిర్మాణం సాధ్యమవుతుందని మోదీ పునరుద్ఘాటించారు. విపక్షాల కుతంత్రాలు నారీశక్తి ప్రస్థానాన్ని ఆపలేవని, త్వరలోనే ఈ చారిత్రాత్మక బిల్లును మళ్లీ ముందుకు తీసుకెళ్లే మార్గాలను అన్వేషిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
No comments:
Post a Comment