- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు
- నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై పశువుల సంచారం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రహదారులపైకి అకస్మాత్తుగా పశువులు రావడం వల్ల వాహనదారులతో పాటు మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోతుండడంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను విచారించింది. రహదారులపైకి పశువుల చొరబాటును అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై నాలుగు వారాల్లోగా స్పందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
రహదారుల భద్రత దృష్ట్యా పిటిషనర్ కోర్టు ముందు పలు కీలక ప్రతిపాదనలు ఉంచారు. పశువుల ప్రవేశాన్ని నివారించేందుకు పక్కాగా అమలు చేయగలిగే జాతీయ మార్గదర్శకాలను రూపొందించాలి. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల పొడవునా పశువులు లోపలికి రాకుండా పటిష్టమైన ఫెన్సింగ్ (కంచె) ఏర్పాటు చేయాలి. పశువుల వల్ల జరిగే ప్రమాదాల్లో గాయపడిన వారికి లేదా మరణించిన వారి కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలి. "రహదారులపై పశువుల సంచారం కేవలం ట్రాఫిక్ అంతరాయం మాత్రమే కాదు, ఇది నిత్యం అనేక మంది ప్రాణాలను బలితీసుకుంటున్న తీవ్రమైన సమస్య. దీనికి శాశ్వత పరిష్కారం అవసరం." ఈ నోటీసులకు ప్రభుత్వం ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.
No comments:
Post a Comment