Sunday, 12 April 2026

లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత

 



  • సంగీత ప్రపంచంలో తీరని లోటు

భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసింది. తన విలక్షణమైన గొంతుతో ఎనిమిది దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించిన లెజెండరీ గాయని ఆశా భోంస్లే (92) ముంబైలో కన్నుమూశారు. శనివారం శ్వాసకోశ ఇన్ఫెక్షన్,  తీవ్ర నీరసంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె, చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే ధృవీకరించారు. ఆమె పార్థివ దేహానికి సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్క్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన ఆమె 93వ వసంతంలోకి అడుగుపెట్టాల్సి ఉండగా, అంతలోనే ఈ విషాదం చోటుచేసుకోవడం సంగీత లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.



కేవలం పదేళ్ల ప్రాయంలోనే 'చలా చలా నవ్ బాలా' అనే మరాఠీ పాటతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆశా భోంస్లే, సుమారు 12 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఆరంభంలో కేవలం వెస్ట్రన్, క్యాబరే పాటలకే ఆమె పరిమితమని భావించినా.. 'దిల్ చీజ్ క్యా హై' వంటి గజల్స్, 'తోరా మన్ దర్పణ్' వంటి శాస్త్రీయ గీతాలతో తనలోని అసమాన ప్రతిభను నిరూపించుకున్నారు. తన సోదరి, స్వరకోకిల లతా మంగేష్కర్‌తో పోటీ ఉందనే వార్తలు వచ్చినా, తామిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లమని ఆమె తరచూ చెప్పేవారు. సంగీతాన్నే తన శ్వాసగా భావించే ఆశా, 90 ఏళ్ల వయసులోనూ దుబాయ్‌లో లైవ్ కన్సర్ట్ ఇచ్చి తనలోని ఎనర్జీ తగ్గలేదని చాటారు. ఇటీవలి 'తౌబా తౌబా' వంటి వైరల్ సాంగ్స్ వరకు మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మలుచుకున్న అరుదైన కళాకారిణి ఆమె.



ఆశా భోంస్లే సినీ ప్రయాణం విజయవంతంగా సాగినా, వ్యక్తిగత జీవితంలో ఆమె అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 16 ఏళ్లకే గణపత్ రావు భోంస్లేతో వివాహం, ఆ తర్వాత విభేదాల వల్ల విడిపోవడం, ఆపై ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్‌తో వివాహం వంటి పరిణామాలు ఆమె జీవితంలో చోటుచేసుకున్నాయి. తన ముగ్గురు పిల్లలలో ఇద్దరిని (వర్ష, హేమంత్) కోల్పోయిన బాధను కూడా ఆమె అనుభవించారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది. రెండు జాతీయ అవార్డులను అందుకున్న ఆమె, చివరిగా 2022లో 'లైఫ్స్ గుడ్' సినిమా కోసం పాట పాడారు. ఒక అద్భుతమైన స్వర ప్రస్థానం ముగిసినా, ఆమె పాడిన వేలాది పాటలు సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

No comments:

Post a Comment

Featured post

అమెరికా గొంతెమ్మ కోర్కెల వల్లే చర్చలు విఫలం

ఇరాన్ ఘాటు విమర్శలు ఇరాన్ , అమెరికా మధ్య పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో పాకిస్తాన్‌లో జరిగిన చరిత్రాత్మక చర్చలు ఎటువంటి ముగింపు ...