- బీజేపీ బటన్‌కు టేప్ వేసి ఓటింగ్ నిలిపివేత
- తృణమూల్ కాంగ్రెస్‌పై బీజేపీ నిప్పులు
- ఆరోపణలను తీవ్రంగా ఖండించిన తృణమూల్ కాంగ్రెస్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ రాజకీయ సెగలు రాజుకున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీకి కంచుకోటగా ఉన్న డైమండ్ హార్బర్‌లోని ఫాల్టా నియోజకవర్గంలో భారీ ఎన్నికల అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపించింది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలపై బీజేపీ గుర్తు ఉన్న బటన్‌కు టేపులు వేసి, ఓటర్లు తమ పార్టీకి ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్ అమిత్ మాలవీయ ధ్వజమెత్తారు. దీనినే తృణమూల్ కాంగ్రెస్ గొప్పగా చెప్పుకునే "డైమండ్ హార్బర్ మోడల్" అని ఆయన ఎద్దేవా చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇలాంటి అక్రమాలతోనే అభిషేక్ బెనర్జీ గెలిచారని ఆరోపిస్తూ, ఫాల్టాలోని బాధిత పోలింగ్ కేంద్రాలన్నింటిలో తిరిగి పోలింగ్ (Repolling) నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఇదంతా ఎన్నికల కమిషన్ , పోలీసు అబ్జర్వర్ అజయ్ పాల్ శర్మ విఫలమవడానికి నిదర్శనమని టీఎంసీ ప్రతినిధి రిజు దత్తా ఎదురుదాడికి దిగారు. తమ అభ్యర్థిని బెదిరించడానికే పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ఈవీఎంలలో లోపాలు ఉంటే దానికి ఈసీ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. బెంగాల్‌లో మమతా బెనర్జీని ఢీకొనలేక, ఓటమి భయంతోనే బీజేపీ నేతలు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మనోజ్ అగర్వాల్ స్పందిస్తూ.. ఎక్కడ ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేలా చూస్తున్నామని తెలిపారు.
No comments:
Post a Comment