ఇరాన్ యుద్ధం నుంచి వెనక్కి తగ్గేది లేదన్న అమెరికా ప్రతినిధుల సభ
ఇరాన్ యుద్ధం నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలంటూ ప్రతిపక్ష డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ గురువారం తిరస్కరించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన సైనిక చర్యలకు రిపబ్లికన్ పార్టీ సభ్యులు పూర్తిస్థాయిలో మద్దతు తెలపడంతో ఈ ప్రయత్నం విఫలమైంది. పార్లమెంట్ అనుమతి లేకుండా సైనిక బలగాలను వినియోగించకూడదన్న విపక్షాల డిమాండ్‌ను సభ 213-214 ఓట్ల స్వల్ప తేడాతో కొట్టిపారేసింది. అంతకుముందు సెనెట్‌లో కూడా ఇలాంటి ప్రయత్నమే విఫలమవ్వగా, ఇప్పుడు హౌస్‌లోనూ ట్రంప్ తన పట్టును నిరూపించుకున్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత, ప్రస్తుతం రెండో వారంలో కొనసాగుతున్న బలహీనమైన కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ ఓటింగ్ ఉత్కంఠను రేకెత్తించింది.
మరో సుదీర్ఘ పోరాటంలో అమెరికా ఇరుక్కుపోతోందని, అగాధపు అంచున నిలబడ్డ దేశాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ తక్షణమే జోక్యం చేసుకోవాలని డెమొక్రాట్ ప్రతినిధి గ్రెగొరీ మీక్స్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల పెట్రోల్ ధరలు గ్యాలన్ 7 డాలర్లకు చేరాయని, ఇప్పటికే 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారని విపక్షాలు ఎండగట్టాయి. సరైన వ్యూహం, ప్రణాళిక లేకుండానే మధ్యప్రాచ్యానికి మరో 10 వేల మంది అదనపు సైనికులను పంపడాన్ని వారు తప్పుబట్టారు. అయితే, రిపబ్లికన్ సభ్యులు మాత్రం ఈ విమర్శలను 'వంచన'గా అభివర్ణించారు. గతంలో జో బైడెన్ హయాంలో యెమెన్‌పై దాడులు జరిగినప్పుడు లేని 'వార్ పవర్స్' గోల, ఇప్పుడు ట్రంప్ విషయంలోనే ఎందుకు వస్తోందని ఫ్లోరిడా ప్రతినిధి బ్రియాన్ మాస్ట్ ప్రశ్నించారు.
ప్రపంచానికి , అమెరికా మిత్రదేశాలకు ముప్పుగా మారిన ఇరాన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకే ట్రంప్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారని రిపబ్లికన్లు సమర్థించుకున్నారు. 1973 నాటి వార్ పవర్స్ చట్టం ప్రకారం, ఏప్రిల్ చివరి నాటికి యుద్ధంపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి సభ మద్దతు ట్రంప్‌కే లభించింది. ఈ ఓటమి డెమొక్రాట్లకు నిరాశ కలిగించినా, యుద్ధం వల్ల కలుగుతున్న ఆర్థిక భారం, అంతర్జాతీయ సంబంధాల్లో ఏర్పడుతున్న బీటలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది ఒక వేదికగా మారింది. రాబోయే వారాల్లో కూడా ఈ అంశంపై మరిన్ని తీర్మానాలు ప్రవేశపెడతామని విపక్షాలు స్పష్టం చేయడంతో అమెరికా రాజకీయాల్లో యుద్ధ సెగలు ఇంకా తగ్గలేదు.
No comments:
Post a Comment