Friday, 24 April 2026

అధికారం ఎవరికీ వంశపారంపర్య ఆస్తి కాదు


  •  బిహార్ అసెంబ్లీలో తేజస్వీ యాదవ్ విమర్శలకు సీఎం సామ్రాట్ చౌదరి ఘాటు కౌంటర్

పట్నా: బిహార్ రాజకీయాల్లో నూతన అధ్యాయం మొదలైంది. అసెంబ్లీలో శుక్రవారం జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఘనవిజయం సాధించింది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నీతీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంతో, ఆయన రాజీనామా తర్వాత బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. 243 మంది సభ్యులున్న సభలో ఎన్డీయే కూటమికి 202 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించగా, విపక్ష ఇండియా కూటమి కేవలం 35 ఓట్లకే పరిమితమైంది.



చర్చను ప్రారంభించిన ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్, ముఖ్యమంత్రిపై సెటైర్లు వేశారు. "ఎన్నికైన ముఖ్యమంత్రి నుంచి సెలెక్ట్ అయిన (ఎంపిక చేయబడిన) ముఖ్యమంత్రిగా మారిన సామ్రాట్ చౌదరికి నా అభినందనలు. మా నాన్న లాలు ప్రసాద్ యాదవ్  పాఠశాలలో చదువుకున్న విద్యార్థి ఈరోజు ముఖ్యమంత్రి కావడం మాకు గర్వకారణం" అంటూ ఎద్దేవా చేశారు. బిహార్‌లో గత ఐదేళ్లలో ఐదు ప్రభుత్వాలు మారడం రాజకీయ అస్థిరతకు నిదర్శనమని, దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శించారు. నీతీష్ కుమార్‌ను రాజకీయంగా ముగించడానికే బీజేపీ ఆయనను రాజీనామా చేయించిందని తేజస్వీ ఆరోపించారు.


తేజస్వీ యాదవ్ విమర్శలకు ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. "అధికారం అనేది ఎవరికీ వంశపారంపర్య ఆస్తి కాదు. 14 కోట్ల బిహార్ ప్రజల ఆశీర్వాదం వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను. నాకు ప్రధాని మోడీ, నీతీష్ కుమార్ వంటి అగ్రనేతల అండదండలు ఉన్నాయి" అని గట్టిగా బదులిచ్చారు. ఒకవేళ నీతీష్ కుమార్ గనుక లేకపోయి ఉంటే గతంలో లాలు యాదవ్ ముఖ్యమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. తన రాజకీయ ప్రస్థానంలో లాలు యాదవ్ పెట్టిన ఇబ్బందులే తనను ఈరోజు ముఖ్యమంత్రి పీఠం వరకు తీసుకువచ్చాయని పేర్కొన్నారు. బిహార్ మొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన సామ్రాట్ చౌదరి, నీతీష్ కుమార్ బాటలోనే అభివృద్ధిని పరుగులు తీయిస్తామని సభలో స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

 కాల్పుల విరమణ పొడిగింపు ప్రకటన వెలువడిన గంటల్లోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు టెల్ అవీవ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలక...