- ప్రియాంకా గాంధీకి అఘోరీ బాబా దీవెన
గౌహతి: అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రాకు ఆసక్తికర అనుభవం ఎదురైంది. గురువారం ఉదయం గౌహతి చేరుకున్న ఆమె, నేరుగా ప్రసిద్ధ కామాఖ్యా దేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఒక అఘోరీ బాబా (నాగ సాధువు) ఆమెను ఆశీర్వదిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆలయ దర్శనం అనంతరం ప్రియాంక బయటకు వస్తుండగా, అక్కడ ఉన్న ఒక సాధువు ఆమె తలపై చేయి ఉంచి దీవిస్తూ.. "హమారా బేటీ ప్రధాన్ మంత్రి బనేగా" (మా బిడ్డ దేశ ప్రధానమంత్రి అవుతుంది) అని గట్టిగా అరిచారు. ఈ అనూహ్య దీవెన విన్న ప్రియాంక ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, చిరునవ్వు చిందిస్తూ అక్కడి నుంచి ముందుకు సాగారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, భక్తులు ఈ దృశ్యాన్ని చూసి కేరింతలు కొట్టారు.
- ఎన్నికల వ్యూహరచనలో బిజీ
ఈ ఆధ్యాత్మిక పర్యటన ముగిసిన వెంటనే ప్రియాంక గౌహతిలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం 'రాజీవ్ భవన్'కు చేరుకున్నారు. అసోం స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఆమె, 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలు, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ప్రియాంక పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది.
No comments:
Post a Comment