- చురం బైపాస్ సమస్యపై గడ్కరీతో చర్చలు!
వాయనాడ్ (కేరళ): వాయనాడ్ పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రా తన నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం పలు అధికారిక, ప్రజా సంబంధాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తన పర్యటనలో భాగంగా మలప్పురంలోని కాళికావు సర్వీస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన హెల్త్ లాబొరేటరీని ఆమె ప్రారంభించారు. అనంతరం నిలంబూర్‌లోని కుమ్మరులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుమ్మరులు తాము తయారుచేసిన అందమైన మట్టి పాత్రలను ప్రియాంకకు బహుమతిగా అందించగా, వృత్తిపరంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె వారికి భరోసా ఇచ్చారు.
అనంతరం ఎడవన్నలో ఇస్లామిక్ సంస్కరణల సంస్థ అయిన కేరళ నద్వతుల్ ముజాహిదీన్ (KNM) రాష్ట్ర అధ్యక్షుడు టి.పి. అబ్దుల్లా కోయ మదానీతో ఆమె భేటీ అయ్యారు. పర్యటనలో భాగంగా చిప్పిలితోడ్ వద్ద వాయనాడ్ చురం (టన్నెల్) బైపాస్ రోడ్డు బాధితులను, స్థానికులను కలుసుకున్న ప్రియాంక, ఆ ప్రాజెక్టు పురోగతిపై కీలక సమాచారాన్ని పంచుకున్నారు. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణంపై తాను ఇప్పటికే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడానని, అక్కడ ఉన్న సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ఆయన ఒక కమిటీని కూడా వేశారని ఆమె స్థానికులకు వివరించారు. ఈ అధ్యయన ప్రక్రియను వేగవంతం చేయాలని తాను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధిపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు.

No comments:
Post a Comment