Saturday, 14 February 2026

రూ. 48,000 కోట్ల భారీ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం



న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, ఆర్థికవృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రూ. 48,000 కోట్లకు పైగా విలువైన భారీ రైల్వే మరియు జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.


ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులు (రూ. 18,509 కోట్లు)

ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని 12 జిల్లాలను కలుపుతూ సుమారు 389 కిలోమీటర్ల మేర రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించే మూడు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కసారా – మన్మాడ్ 3వ, 4వ లైన్, ఢిల్లీ – అంబాలా 3వ, 4వ లైన్., బళ్లారి – హోసపేట 3వ , 4వ లైన్. ఈ ప్రాజెక్టులు పీఎం-గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద చేపట్టబడతాయి. ఇవి రవాణా సౌకర్యాలను పెంచడమే కాకుండా, లాజిస్టిక్ ఖర్చులను తగ్గించి, ఇంధన దిగుమతులను తగ్గించడానికి దోహదపడతాయి. నిర్మాణ సమయంలో సుమారు 265 లక్షల పని దినాల ఉపాధి లభిస్తుంది.


అసోం  బ్రిడ్జ్ కమ్ రైల్ టన్నెల్ (రూ. 18,662 కోట్లు)

అసోంలోని గోహ్పూర్ (ఎన్‌హెచ్‌-15) నుంచి నుమాలీగఢ్ వరకు 4-లేన్ల గ్రీన్ఫీల్డ్ కనెక్టివిటీ నిర్మాణానికి ఆమోదం లభించింది. ఇందులో బ్రహ్మపుత్ర నది కింద 15.79 కిలోమీటర్ల పొడవైన రోడ్ కమ్ రైల్ టన్నెల్ నిర్మాణం అత్యంత కీలకమైనది. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా, 11 ఎకనామిక్ నోడ్స్ , ప్రధాన రైల్వే స్టేషన్లను కలుపుతుంది.


జాతీయ రహదారుల విస్తరణ (రూ. 11,000 కోట్లు)


తెలంగాణ: హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో గూడెల్లూరు నుంచి మహబూబ్‌నగర్ వరకు ఎన్‌హెచ్‌-167ను 4-లేన్లుగా విస్తరించడానికి రూ. 3,175.08 కోట్లు మంజూరయ్యాయి. మహారాష్ట్ర: ఎన్‌హెచ్‌-160A లోని ఘోటి – త్రింబక్ – పాలఘర్ విభాగం పునరుద్ధరణకు రూ. 3,320 కోట్లు కేటాయించారు. గుజరాత్: ఎన్‌హెచ్‌ -56 లోని ధమాసియా-బిటాడా, నాసర్‌పోర్-మాలోథా విభాగాల విస్తరణకు రూ. 4,583 కోట్లు ఆమోదించబడ్డాయి.ఈ ప్రాజెక్టులన్నీ పూర్తికావడం ద్వారా దేశంలో లాజిస్టిక్ సామర్థ్యం పెరగడమే కాకుండా, సుమారు 345 లక్షల పని దినాల ఉపాధి కల్పన జరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...