- బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ
- ప్రపంచ సవాళ్లపై ఉమ్మడి పోరు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికలపై అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యాన్న చాటిచెప్పడంలో భారత్, బ్రెజిల్ దేశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, బ్రెజిల్ దేశాలు కలిసి పనిచేసినప్పుడు 'గ్లోబల్ సౌత్' (అభివృద్ధి చెందుతున్న దేశాల) స్వరం ప్రపంచవ్యాప్తంగా మరింత బలంగా వినిపిస్తుందని, ఇది అంతర్జాతీయ నిర్ణయాధికారంలో సమతుల్యతను తీసుకువస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో ఇరువురు నేతలు ఇంధనం, రక్షణ రంగం, వ్యవసాయం, వాతావరణ మార్పుల వంటి ప్రధానాంశాలపై లోతుగా చర్చించారు.
ఈ సమావేశం ప్రధానంగా జి20 (G20), బ్రిక్స్ (BRICS) కూటముల్లో ఇరుదేశాల మధ్య ఉన్న సహకారాన్ని మరింత పటిష్టం చేసే దిశగా సాగింది. ముఖ్యంగా బ్రెజిల్ అధ్యక్షతన జరగనున్న జి20 సదస్సులో భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను కాపాడటంపై ఇరువురు నేతలు ఒకే తాటిపైకి వచ్చారు. అంతర్జాతీయ సంస్థల సంస్కరణలు, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మార్పుల కోసం ఇరు దేశాలు కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాయి. ఈ భేటీ అనంతరం ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. బ్రెజిల్ అధ్యక్షుడితో జరిగిన చర్చలు ఎంతో ఫలప్రదంగా సాగాయని, ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కేవలం రెండు దేశాలకే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వానికి కూడా దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment