- రాష్ట్రపతి భవన్‌లో రాజాజీ విగ్రహావిష్కరణ
- భారతీయతకు పెద్దపీట వేయడం గర్వకారణమన్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: స్వతంత్ర భారత తొలి భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి (రాజాజీ) జీవితాన్ని, ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో 'రాజాజీ ఉత్సవ్' వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అశోక మండపం సమీపంలోని గ్రాండ్ ఓపెన్ స్టైర్‌కేస్ వద్ద రాజాజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. గతంలో ఇక్కడ ఉన్న బ్రిటిష్ వాస్తుశిల్పి ఎడ్విన్ ల్యూటెన్స్ విగ్రహం స్థానంలో ఇప్పుడు భారత గడ్డపై పుట్టిన గొప్ప మేధావి రాజగోపాలాచారి విగ్రహాన్ని ప్రతిష్టించడం ఒక చరిత్రాత్మక మార్పుగా నిలిచింది. ఈ వేడుకలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, ఎస్. జైశంకర్, ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్ర సింగ్ షెకావత్, ఎల్. మురుగన్‌తో పాటు రాజాజీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. రాజగోపాలాచారిని భారత మాత ముద్దుబిడ్డగా అభివర్ణించారు. రాజనీతిజ్ఞుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, న్యాయకోవిదుడిగా, గొప్ప రచయితగా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. పురాతన భారతీయ గ్రంథాల నుంచి ఆధునిక రాజకీయాల వరకు ఆయన చూపిన ప్రతిభ అమోఘమని, ఆయన ఆశయాలను అనుసరించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. 'దేశమే ప్రథమం' అనే స్ఫూర్తితో ప్రజలందరూ ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన 'బానిసత్వ మనస్తత్వం నుంచి విముక్తి' అనే లక్ష్యం ఇప్పుడు ఆచరణలో కనిపిస్తున్నది, రాజ్‌భవన్‌లు నేడు లోక్ భవన్‌లుగా మారుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
ఈ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పంపిన సందేశాన్ని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సభలో చదివి వినిపించారు. రాష్ట్రపతి భవన్‌లోని వలసపాలన నాటి పెయింటింగ్‌లు, కళాఖండాల స్థానంలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కళాఖండాలను ఉంచడం అభినందనీయమని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. సార్వభౌమాధికారం అనేది కేవలం రాజకీయ, ఆర్థిక అంశాల్లోనే కాకుండా సాంస్కృతిక రంగాల్లో కూడా ప్రతిబింబించాలని ఆయన స్పష్టం చేశారు. నేడు రాష్ట్రపతి భవన్ కేవలం అధికార కేంద్రంగా కాకుండా భారతీయ నాగరికత, ప్రజాస్వామ్య ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా నిలిచిందని మోడీ కొనియాడారు. కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ మాట్లాడుతూ రామాయణ, మహాభారతాలను ఆంగ్లం, తమిళ భాషల్లోకి అనువదించి రాజాజీ భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేశారని గుర్తుచేశారు.
No comments:
Post a Comment