Thursday, 5 February 2026

140 కోట్ల భారతీయుల ఇంధన భద్రతే మాకు ముఖ్యం


  • రష్యా చమురు నిలిపివేత వార్తలను కొట్టిపారేసిన భారత్
  • ట్రంప్ వ్యాఖ్యలపై స్పష్టత
న్యూఢిల్లీ: భారతదేశం తన ఇంధన అవసరాల విషయంలో ఎవరి ఒత్తిడికి తలొగ్గబోదని, 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతే తమకు పరమావధి అని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను భారత్ నిలిపివేయబోతున్నదని, అమెరికా నుంచి దిగుమతులు పెంచుకునేందుకు ప్రధాని మోడీ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ అధికారికంగా తోసిపుచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసే ఉద్దేశం ప్రస్తుతం లేదని, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎక్కడ తక్కువ ధరకు నాణ్యమైన చమురు లభిస్తే అక్కడి నుంచి కొనుగోలు చేస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.



అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల అస్థిరత కొనసాగుతున్న తరుణంలో, రష్యా భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉందని ప్రభుత్వం గుర్తుచేసింది. ఇంధన భద్రత అనేది కేవలం వ్యాపారం మాత్రమే కాదని, అది దేశ ఆర్థికవ్యవస్థకు వెన్నెముక వంటిదని భారత్ పేర్కొంది. ఇతర దేశాల నుండి చమురు దిగుమతులను వైవిధ్యీకరించడం  సహజమైన ప్రక్రియ అని, అయితే అది రష్యాతో ఉన్న సంబంధాలను తెంచుకోవడం కాదని వివరించింది. అమెరికాతో కూడా ఇంధన రంగంలో సహకారాన్ని పెంచుకుంటామని, కానీ అది రష్యా చమురుకు ప్రత్యమ్నాయం కాదని దౌత్యవర్గాలు వెల్లడించాయి. భారత్ తీసుకున్న ఈ దృఢమైన నిర్ణయం అంతర్జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...