- సీఎం రేవంత్ రెడ్డితో భేటీ
- పునరావాస ప్యాకేజీ పెంపుపై విన్నపం!
హైదరాబాద్: దశాబ్దాల పాటు అడవి బాట పట్టిన మావోయిస్ట్ అగ్రనేతలు జనజీవన స్రవంతిలోకి చేరి సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. శుక్రవారం నాడు సీపీఐ (మావోయిస్ట్) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీ, మల్లా రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాదరావు, పోతుల పద్మావతిలతో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ మాజీ కార్యదర్శి బడే చొక్కారావు, మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి తదితరులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. హింసను వీడి ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకున్నందుకు వారిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. హింస వల్ల ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం దొరకదని, ప్రజల ఆకాంక్షలు కేవలం ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారానే నెరవేరుతాయని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.
తమను జనజీవన స్రవంతిలో భాగం చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన మాజీ మావోయిస్టు నేతలు, సీఎంకు ఒక కీలక విన్నపం చేశారు. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న పునరావాస విధానాల తరహాలోనే తెలంగాణలో కూడా లొంగిపోయిన క్యాడర్‌కు అందించే సహాయం, పునరావాస ప్యాకేజీని మరింత పెంచాలని వారు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, లొంగిపోయిన మావోయిస్టులకు భద్రతతో పాటు మెరుగైన పునరావాసం కల్పించడంలో తమ ప్రభుత్వం ఎటువంటి లోటు రానీయదని హామీ ఇచ్చారు. సమాజంలో వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పిలుపు మేరకు గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 591 మంది మావోయిస్టులు ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకంతో ప్రధాన స్రవంతిలోకి వచ్చారని వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మెరుగైన పునరావాస విధానాలు, పోలీసుల కృషి వల్లనే అగ్రనేతల్లో కూడా మార్పు వచ్చిందని, వారంతా ఇప్పుడు సాధారణ పౌరులుగా ప్రశాంత జీవనం గడుపుతున్నారని ఆయన వివరించారు. ఈ పరిణామం రాష్ట్రంలో శాంతిభద్రతల స్థాపనలో ఒక కీలక మైలురాయిగా నిలిచిందని పోలీస్ శాఖ వర్గాలు భావిస్తున్నాయి.
No comments:
Post a Comment