- జాతీయ భద్రతా బృందంతో అధ్యక్షుడి నిరంతర సమీక్ష
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా జరిపిన భారీ సైనిక దాడుల (నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితులను అత్యంత నిశితంగా గమనిస్తున్నారు. ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో రిసార్ట్ నుంచి జాతీయ భద్రతా బృందంతో కలిసి ఆయన శనివారం రాత్రంతా పరిణామాలను సమీక్షించారని వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ ధృవీకరించారు. ఇరాన్‌లోని అణు కేంద్రాలు, క్షిపణి తయారీ స్థావరాలే లక్ష్యంగా సాగుతున్న ఈ ఆపరేషన్ పురోగతిని ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
దాడులు ప్రారంభమైన కొద్దిసేపటికే ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. ఈ సైనిక చర్య ఉద్దేశ్యం ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును తొలగించడమేనని, అమెరికా, దాని మిత్రదేశాల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ట్రంప్ స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే ఈ దాడుల గురించి అమెరికా కాంగ్రెస్ నాయకులకు సమాచారం అందించారు. అమెరికా పౌరుల భద్రతే తమకు ప్రథమ ప్రాధాన్యమని, ఇరాన్ తన అణు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసే వరకు ఈ ఒత్తిడి కొనసాగుతుందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఇరాన్ అంతటా పేలుళ్లు సంభవిస్తుండటం, ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు సిద్ధమవడంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం పతాక స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన భద్రతా బృందంతో కలిసి తదుపరి వ్యూహాలపై చర్చిస్తున్నారు. యుద్ధ తీవ్రత పెరుగుతున్న కొద్దీ అమెరికా తన సైనిక మోహరింపును మరింత పెంచే అవకాశం ఉన్నట్లు దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.
No comments:
Post a Comment